Shopping Mall Actress Sindhu Passed Away : ఫీల్ గుడ్లవ్ స్టోరీ 'షాపింగ్ మాల్' సినిమా సహాయనటి సింధు (44) కన్నుమూశారు. సోమవారం ఉదయం 2.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 2020 నుంచి రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈమె.. చెన్నై వలసరవక్కమ్లోని నివాసంలో లోకాన్ని విడిచారు. ఆర్థిక పరిస్థితులతో సతమతమౌతున్న నటి సింధు.. గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. సింధు మృతి పట్ల ఆమె తోటి నటీనటులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె మరణించడం బాధకారమన్నారు.
సింధు చిన్న వయసు నుంచే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2010లో షాపింగ్ మాల్ సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత కూడా సింధు పలు సినిమాల్లో సహాయనటిగా పనిచేశారు. కాగా ఆమెకు 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగింది. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చారు సింధు. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో సోమవారం సింధు అంత్యక్రియలు జరగనున్నాయి.