టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. సోమవారంతో శర్వానంద్ సినీ కెరీర్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు శర్వానంద్. దీనికి సంబంధించి ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విషెస్ చెప్పిన అందరికీ ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు శర్వానంద్.
'20 ఏళ్లుగా కెమెరా ముందు ఉంటూ సిల్వర్ స్క్రీన్‌పై మీ అందరినీ అలరిస్తున్నాను. ఈ రెండు దశాబ్దాల నా కెరీర్లో ఎన్నో భావోద్వేగాలతో కూడిన స్నేహాలు, కష్టాలు, ఎత్తుపల్లాలు , కుంగుబాట్లు, చిరునవ్వులు, పోరాటాలను ఆస్వాదించాను. బహుశా వేరే మార్గంలో ఇవి చూసేవాడిని కాదేమో. ఈ ప్రయాణంలో నా వెన్నంటి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని ఉన్నతంగా నిలిపడం సహా నన్ను మంచి వ్యక్తిగా మారేలా చేశాయి. రెండు దశాబ్దాల నా సినిమా కెరీర్ నాకెన్నో గొప్ప బాధ్యతల్ని నేర్పించింది. నా ఈ 'ఒకే ఒక్క జీవితం' సినిమాకే అంకితం. 20 ఏళ్ల క్రితం 'శ్రీకారం' చుట్టిన ఈ నా సినీ 'ప్రస్థానం' మర్చిపోలేనిది. ఈ సినీ ప్రపంచంలో నా 'గమ్యం' ఇంకా చాలా దూరం మిగిలి ఉంది. మంచి చిత్రాలతో మీ అందరినీ అలరించేందుకు ఎప్పుడూ 'రన్ రాజా రన్'లా పరుగులు పెడుతూనే ఉంటాను. ఇందుకోసం కష్టపడి పని చేస్తానని మీకు మాటిస్తున్నాను. అయితే మీరు 'శతమానం భవతి' అంటూ నాకిచ్చే ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమవుతుంది.' అంటూ తాను నటించిన పలు సినిమాల పేర్లను జోడిస్తూ రాసుకొచ్చారు శర్వానంద్.
శర్వానంద్ ఎమోషనల్ ట్వీట్ 20 ఏళ్లు.. 34 సినిమాలు..
'అయిదో తారీఖు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో శర్వానంద్. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు అంతగా ఆదరించలేదు. ఇక తర్వాత 'యువసేన'తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్నారు. దీంతో శర్వానంద్‌కు మంచి పేరు కూడా వచ్చింది. 'సంక్రాంతి', 'లక్ష్మి' సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ తమ్ముడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 'అమ్మ చెప్పింది'లో తన నటనతో అందరినీ మెప్పించారు. 'గమ్యం' సినిమాతో తన సినీ జీవితానికి యూటర్న్ వచ్చినట్లయింది. 'రన్ రాజా రన్'తో టాలీవుడ్లో మరింత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'శతమానం భవతి'తో క్లాసికల్ ఆడియన్స్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు.
ఇకపోతే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో శర్వానంద్ తన 35వ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభమైంది. ఈ రోజు(మార్చి 6న) శర్వానంద్ 39వ జన్మదినం సందర్భంగా ఆయనపై తీసిన ఓ ఫొటోషూట్‌కు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా, శర్వానంద్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఇటీవల శర్వానంద్ రక్షితా రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే.