Hero Sharwanand OKe Oka Jeevitham Movie : సున్నితమైన... సాహసోపేతమైన ఇలాంటి కథలతో విజయాన్ని అందుకోవడం ప్రత్యేకం అన్నారు శర్వానంద్. మంచి కథల్ని ఎంపిక చేసుకుంటాడనే గుర్తింపున్న కథానాయకుల్లో ఆయన ఒకరు. ఇటీవల విడుదలైన 'ఒకే ఒక జీవితం'తో కథానాయకుడిగా మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ముచ్చటించారు.
"నా మనసుకు బాగా దగ్గరైన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఇలాంటి కథల్లో లాజిక్ వెడకడం చాలా సులువు. అలాంటి ఈ సినిమా అటు ప్రేక్షకులతోపాటు, ఇటు విమర్శకులని కూడా మెప్పించింది. మేం ఊహించినట్టుగానే సినిమా అందరికీ కనెక్ట్ కావడంతోనే ఈ విజయం దక్కింది. పిల్లలు కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తున్నారు. ఈమధ్య చిన్నారుల కోసం ఓ షో వేశాం.వాళ్లు చాలా ఆస్వాదించారు. టైమ్ మిషన్ ఎక్కి ఎక్కడికి వెళతారని అడిగితే... 'మేం ఇక్కడే ఉంటాం. ఈ లైఫ్ బాగుంది' అన్నారు. ఈతరం పిల్లల్ని వాళ్ల అభిరుచులకి తగ్గట్టుగా పెంచుతున్నారు తల్లిదండ్రులు. అందుకే వాళ్లు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అర్థమైంది" అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చారు.
"నా వరకైతే నా జీవితంలో ఇంటర్ రోజులంటే చాలా ఇష్టం. హ్యాపీడేస్ అవి. రేపటి గురించి ఆలోచన అనేదే ఉండేది కాదు. టైమ్ మిషన్‌లో ప్రయాణం చేస్తే మరోసారి ఆ రోజులకి వెళతా. దర్శకుడు శ్రీకార్తీక్ 'ఒకే ఒక జీవితం' కథని చాలా బాగా చెప్పాడు. అప్పుడే తన ప్రతిభ ఏమిటో అర్థమైంది. ఈ సినిమా చేయకపోతే నువ్వు చాలా కోల్పోతావని వేరే నటులకి నేనెప్పుడూ చెప్పలేదు. వెన్నెల కిషోర్‌కి మాత్రం నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దని ఈ సినిమా కోసం ఒప్పించా. సినిమాపై నాకున్న నమ్మకం నిజమైంది."