Sharwanand About His Failures: కెరీర్‌లో ఎదురైన ఓ చేదు ఘటనని తాను జీర్ణించుకోలేకపోయానని నటుడు శర్వానంద్ అన్నారు. ప్రస్తుతం 'ఒకే ఒక జీవితం' రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న ఆయన తాజాగా ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో సరదాగా ముచ్చటించారు. ఇందులో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
"కెరీర్‌లో ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా? కెరీర్‌పరంగా బాధపడిన సంఘటన ఏదైనా ఉందా?" అని తరుణ్ భాస్కర్ ప్రశ్నించగా.. "ఇటీవల నేను నటించిన నాలుగు చిత్రాలు ప్రేక్షకులకు చేరువ కాలేదు. పరాజయాల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అప్పుడు అర్థమైంది. 'పడిపడి లేచె మనసు' ఎంతో నమ్మి చేశా. తప్పకుండా విజయం అందుకుంటుందనుకున్నా. ఈ సినిమా కోసం సుమారు 130 రోజులు కష్టపడ్డా. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మూడు నెలలు బయటకు రాలేదు. చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా విజయాన్ని అందుకోలేదు. దాంతో నాకు నేనుగా విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టా. గత ఆరు నెలలుగా ఏ సినిమాకీ వర్క్ చేయకపోవడానికి కారణమదే. హడావుడిగా సినిమాలు చేసి ఏం లాభం? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఏదైనా ప్రాజెక్ట్‌కు సంతకం చేయడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా" అని తెలిపారు.