దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'పఠాన్'గా వెండితెరపై కనిపించనున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్. భారీ అంచనాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం..
- ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి భారతీయ చిత్రం. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలవుతోంది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, ఐసీఈ తదితర ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
- విదేశాల్లోనూ అనూహ్య స్పందన వస్తోంది. అమెరికా, యుఏఈ, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రికార్డు స్థాయిలో టికెట్లు
- అమ్ముడుపోయాయి.
- విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పీవీఆర్, ఐనాక్స్, సినిపొలిస్ సంస్థలకు చెందిన మల్టీప్లెక్స్ థియేటర్లలో 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షోలో 10 లక్షలకు పైగా టికెట్లు బుక్కయ్యాయి. దీన్నిబట్టి తొలిరోజు వసూళ్ల విషయంలో గత రికార్డులన్నింటినీ బద్దలుకొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- వివాదాల నేపథ్యంలో విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చిత్రబృందం నిర్ణయించింది.
- 50 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ముంబయిలోని ప్రసిద్ధ గెయిటీ గెలాక్సీ థియేటర్లో, గతంలో ఎన్నడూ లేని విధంగా విడుదల రోజున ఉదయం 9 గంటలకే 'పఠాన్' చిత్రాన్ని ప్రదర్శించనుండటం విశేషం. అభిమానుల కోరిక మేరకు చాలా చోట్ల ఈ చిత్రాన్ని ఉదయం ఆరు గంటలకే ప్రదర్శించనున్నారు. ఈ ట్రెండ్‌ను ప్రారంభించిన తొలి బాలీవుడ్ చిత్రంగా 'పఠాన్' నిలవనుంది.
- ఇదే సంస్థ గతంలో నిర్మించిన స్పై యూనివర్స్ చిత్రాలు 'ఏక్ థా టైగర్' సిరీస్, 'వార్'లో నటించిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కూడా 'పఠాన్'లో అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు తెలుస్తోంది.
- జాన్ అబ్రహం ప్రతినాయక పాత్రలో నటించారు. షారుక్, జాన్ అబ్రహం మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రబృందం చెబుతోంది. మిషన్ ఇంపాజిబుల్, టాప్ గన్ మేవరిక్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ కేసీ ఓ నీల్ ఈ చిత్రానికి పోరాటాలు సమకూర్చడం విశేషం.
- దేశవ్యాప్తంగా మూతపడ్డ 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లు 'పఠాన్'తో మళ్లీ తెరచుకోనున్నాయి.
- దీపికా కూడా గూఢచారిగా నటించింది. షారుక్‌తో కలసి రొమాంటిక్ సన్నివేశాలు చేయడమే కాదు, భారీ పోరాటాలూ చేసింది. వీరి కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది.
- బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్లతో మెప్పించిన సిద్ధార్థ్ ఆనంద్.. షారుక్‌తో తెరకెక్కించిన తొలి చిత్రమిది.
- షారుక్ ఖాన్ గూఢచారిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యష్‌రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో, విదేశీ లొకేషన్లలో కళ్లు చెదిరే హంగులతో నిర్మించింది.