Sharukh khan 30 years Pathan First look: ఆయన సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ఆ స్టార్ బయట కనపడితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడేవారు ఎందరో. నటుడిగా మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్.. మన షారుక్ ఖాన్. శనివారంతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 30ఏళ్లు పూర్తిచేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పఠాన్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో చేతిలో గన్‌తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు షారుక్. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇక, ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుందీ మూవీ.
కాగా, 1980లలో టెలివిజన్ సిరీస్‌తో షారుక్ కెరీర్ ఆరంభించారు. 1992లో 'దీవానా'తో తెరంగేట్రం చేశారు. 'డర్' (1993), 'బాజీగర్' (1993), 'అంజామ్' (1994) సినిమాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' (1995), 'దిల్‌తో పాగల్ హై'(1997), 'కుచ్ కుచ్ హోతా హై' (1998), 'కభీ ఖుషీ కభీ గమ్' (2001) తదితర ప్రేమకథా చిత్రాలతో స్టార్ హీరోగా రాణించారు. 2002లో వచ్చిన 'దేవదాస్' సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన.