బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించేందుకు సిద్దంగా ఉన్నారు!. జనవరి 25న విడుదల కాబోతోన్న ఈ సినిమా కోసం వీలైనంతగా ప్రమోషన్స్ చేసేందుకు కింగ్ ఖాన్ సిద్ధమయ్యారు. అందుకే ఈ మధ్య వీలైనప్పుడల్లా ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.
'తెలుగు రాష్ట్రాల్లో 'పఠాన్' ప్రమోషన్స్.. రామ్‌చరణ్ తీసుకెళ్తే వస్తా!' - రామ్‌చరణ్ షారుక్ ఖాన్ ప్రమోషన్స్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. మరోసారి రామ్‌చరణ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. తన కొత్త సినిమా పఠాన్ ప్రమోషన్స్.. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలంటే చరణ్ వచ్చి తనను తీసుకెళ్లాలని ట్వీట్ చేశారు.
అయితే తాజాగా షారుక్ తన ఫాలోవర్లతో మరోసారి చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు వస్తారా? అని అడిగారు. అందుకు షారుక్ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. రామ్‌చరణ్ తనను తీసుకెళ్తే వస్తానంటూ మెగా పవర్‌స్టార్ మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతకుముందు పఠాన్ ట్రైలర్ రిలీజ్ చేసిన సమయంలోనూ చరణ్ మీదున్న ప్రేమను వ్యక్తం చేశారు. 'ఆస్కార్ మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను తాకనివ్వు' అని ప్రేమగా ట్వీట్ చేశారు.
మరికొద్ది రోజుల్లో పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్ గురించి బాలీవుడ్ నటులకు బాగా అర్థమైంది. ఇక్కడ కనుక సినిమా క్లిక్ అయితే మాత్రం కోట్లకు కోట్లు దండుకోవచ్చని తెలిసి వచ్చింది. అందుకే తెలుగులోనూ ఈ సినిమాను గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్ షేర్ చేసేలా ప్లాన్ చేశారు పఠాన్ మేకర్స్.