Senior actress Leelavati Passes Away :ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి (87) శుక్రవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడతున్న నటి నేలమంగళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆమె కుమారుడు వినోద్ రాజ్ వెల్లడించారు.
లీలావతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. 'కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి లీలావతి తుదిశ్వాస విడిచారనే వార్త బాధ కలిగించింది. గత వారం నేను ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. ఆమె కుమారుడు వినోద్ రాజ్‌తో మాట్లాడాను. ఎన్నో ఏళ్లుగా ఆమె మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన లీలావతి చిరకాలం మనతోనే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి కలగాలని ప్రార్థిస్తున్నాను' అని సిద్ధరామయ్య ట్విట్టర్ వేదికగా తెలిపారు.
సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, జేడీ (ఎస్) అధినేత హెచ్డీ కుమార స్వామి, కర్ణాటక ప్రతిపక్ష నాయుకుడు, బీజేపీ నేత ఆర్ అశోక సోషల్ మీడియా వేదికగా లీలావతి మృతి పట్ల సంతాపం తెలిపారు. వీరితో పాటు సినీరాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు.