Actor Naresh reacts on Cine workers strike: సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. అకస్మాతుగా స్ట్రైక్ ప్రకటించడం సరైనది కాదని అన్నారు. సినీపెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా తన వంతుగా ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
"నిన్నటి నుంచి టీవీలన్నీ మార్మోగుతున్నాయి. ఒకటి రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్‌లు ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా కరోనా వల్ల ప్రపంచంతో పాటు సినీపరిశ్రమ కూడా అట్టడుగుకు వెళ్లిపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు నానా ఇబ్బందులు పడ్డారు. మెడికల్ ఖర్చులకు కూడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పడిప్పుడే వెంటిలేటర్‌పై ఊపిరిపీల్చుకుంటూ పరిశ్రమ కోలుకుంటోంది. తెలుగు సినీపరిశ్రమకు మంచి పేరు వస్తోంది. బ్యాంకులు నిండకపోయినా కంచాలు నిండుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. సడెన్‌గా స్ట్రైక్ అంటే కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ బిడ్డగా ఒక్కటే కోరుతున్నాను. నిర్మాతలు కూడా కరోనా సమయంలో కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు. కాబట్టి వారం పది రోజులు సమయం తీసుకుని.. ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్‌కు ఇబ్బంది లేకుండా అందరూ కలిసి పరిష్కారం తీసుకొస్తాం. నా వంతుగా నేనేం చేయాలో దానికి సిద్ధంగా ఉన్నాను. సినీపరిశ్రమ అంధకారంలోకి వెళ్లకుండా ఆపి ఈ షూటింగ్‌లు మరికొన్నిరోజులు ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటే మంచిదని భావిస్తున్నాను." అని అన్నారు.