Senior Actor Balayya died: ప్రముఖ నటుడు బాలయ్య(92) శనివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కెరీర్లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు బాలయ్య. పుట్టినరోజు నాడే చనిపోవటం బాధాకరమైన విషయం.
పుట్టినరోజే చనిపోయిన ప్రముఖ సీనియర్ నటుడు - సీనియర్ నటుడు బాలయ్య
10:09 April 09
Senior Actor Balayya died
గుంటూరు జిల్లా వైకుంఠపురం(అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించారు బాలయ్య. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు.
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించారు. 1958లో 'ఎత్తుకు పై ఎత్తు' సినిమాలో నాయక పాత్ర వేశారు బాలయ్య. తరువాత 'భాగ్యదేవత', 'కుంకుమరేఖ' చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'భూకైలాస్' చిత్రంలో శివునిగా కనిపించి మెప్పించారు. ఆ తరువాత 'చెంచులక్ష్మి', 'పార్వతీకల్యాణం' నుంచి నేటి వరకు 300లకు పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి 'నేరము-శిక్ష', 'అన్నదమ్ముల కథ', 'ఈనాటి బంధం ఏనాటిదో' (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'చెల్లెలి కాపురం' చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి నంది పురస్కారాన్ని బహుకరించింది. ఆయన స్వీయ దర్శకత్వంలో 'పోలీస్ అల్లుడు' (1994), 'ఊరికిచ్చిన మాట' (1981) నిర్మించారు. మొత్తంగా పలు చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన ఆయన కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు.
బాలయ్య సంతాపం: సీనియర్ నటుడు మన్నవ బాలయ్య మృతిపట్ల నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. "సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణ వార్త నన్నెంతో కలచివేసింది. ఆయన అద్భుతమైన నటుడు. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడు, కథారచయితగా బాలయ్య తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ నటించిన ‘శ్రీరామరాజ్యం’, ‘మిత్రుడు’ చిత్రాల్లో బాలయ్య కీలక పాత్రలు పోషించారు.
ఇదీ చూడండి:హీరోయిన్ బాత్రూమ్లో దూరిన ఫ్యాన్.. పెళ్లి చేసుకోవాలంటూ..