తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'శేఖర్' రివ్యూ.. పోలీస్​ పాత్రలో రాజశేఖర్​ మరోసారి మెప్పించారా? - రాజశేఖర్

Sekhar Review: వ‌య‌సు పైబ‌డిన పోలీస్ అధికారి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం 'శేఖర్'. జీవిత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ చిత్రం 'జోసెఫ్'​కు రీమేక్​గా రూపొందిన 'శేఖర్'.. ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలుసుకోండి.

Sekhar Review
sekhar telugu movie review

By

Published : May 20, 2022, 4:10 PM IST

Updated : May 20, 2022, 4:59 PM IST

Sekhar Review: చిత్రం:శేఖర్; న‌టీన‌టులు: రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని రాజశేఖర్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర త‌దిత‌రులు; సంగీతం: అనూప్ రూబెన్స్; కూర్పు: ర‌వితేజ గిరిజాల‌; ఛాయాగ్ర‌హ‌ణం: మల్లికార్జున్ నరగని; నిర్మాతలు:బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం; ద‌ర్శ‌క‌త్వం: జీవిత రాజ‌శేఖ‌ర్‌; విడుద‌ల తేదీ: 20-05-2022

'శేఖర్'

వేస‌వి సినీ మార‌థాన్ ముగింపు కొచ్చింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా చిత్రాల‌తో బాక్సాఫీస్ హోరెత్తింది. ఇప్పుడు మీడియం రేంజ్ బ‌డ్జెట్ చిత్రాల సంద‌డి మొదలైంది. అలా ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన చిత్రం 'శేఖర్'. 'గరుడ వేగ', 'కల్కి' వంటి విజయాల తర్వాత రాజ‌శేఖ‌ర్ నటించిన చిత్రమిది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. రాజ‌శేఖ‌ర్ స‌తీమ‌ణి జీవిత ఈ సినిమాని స్వయంగా తెర‌కెక్కించ‌డం, వారి పెద్ద కుమార్తె శివాని కీల‌క పాత్రలో న‌టించ‌డంతో అంద‌రి దృష్టి ఈ చిత్రంపైప‌డింది. దీనికి తోడు పాట‌లు, ప్రచార చిత్రాలు ఆక‌ర్షణీయంగా క‌నిపించ‌డం వల్ల సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాలను 'శేఖ‌ర్' అందుకున్నాడా లేదా ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

రాజశేఖర్, శివాని

ఇదీ కథ: శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) రిటైర్డ్ పోలీసు అధికారి. హ‌త్య కేసుల్ని ఛేదించ‌డంలో నిపుణుడు. క్రైమ్ సీన్‌ను చూసి.. నేర‌స్థుడెవ‌రో ఇట్టే క‌నిపెట్టగ‌డంలో దిట్ట. అందుకే క్లిష్టమైన మ‌ర్డర్ కేసులు ఎదురైన ప్రతిసారీ పోలీసులు శేఖ‌ర్ స‌హాయాన్నే కోరుతుంటారు. అయితే శేఖ‌ర్ వ్యక్తిగ‌త జీవితం విషాద‌భ‌రితం. మాజీ భార్య ఇందు (ఆత్మీయ రాజ‌న్‌), కూతురు గీత (శివానీ), ప్రేయ‌సి కిన్నెర (ముస్కాన్‌) జ్ఞాప‌కాలు అత‌న్ని వెంటాడుతుంటాయి. అనుకోకుండా ఓసారి ఇందు రోడ్డు ప్రమాదానికి గుర‌వుతుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణిస్తుంది. అంద‌రూ దీన్ని రోడ్డు ప్రమాదంగానే భావిస్తారు. అయితే ఘ‌ట‌నా స్థలంలో క‌నిపించిన ఆధారాల్ని బ‌ట్టి శేఖ‌ర్ ఆమెని ఎవ‌రో హ‌త్య చేశార‌ని గుర్తిస్తాడు. దీంతో క‌థ మ‌లుపు తిరుగుతుంది. మ‌రి ఆమెను హ‌త్య చేసింది ఎవ‌రు? దాని వెన‌కున్న కార‌ణాలేంటి? నేర‌స్థుల్ని ప‌ట్టుకోవ‌డానికి శేఖ‌ర్ ఏమి చేశాడు? అస‌ల‌ు అత‌ని ప్రేయ‌సి కిన్నెర‌, కూతురు గీత ఏమ‌య్యారన్నదే శేఖర్ కథ.

ఎలా ఉందంటే:మ‌ల‌యాళ చిత్రసీమ ఎన్నో ర‌స‌వ‌త్తర‌మైన థ్రిల్లర్ సినిమాలకు చిరునామా మారుతోంది. ఏ భాష‌లో లేని విధంగా ఏటా బోలెడ‌న్ని థ్రిల్లర్ కథ మ‌ల‌యాళం నుంచే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వ‌స్తున్న థ్రిల్లర్స్ లో దాదాపు స‌గానికి పైగా.. మాలీవుడ్ రీమేక్‌లే. శేఖ‌ర్ కూడా ఆ సీమ నుంచి అరువు తెచ్చుకున్న క‌థే. 2018లో విడుద‌లై విజ‌య‌వంత‌మైన 'జోసెఫ్'కు రీమేక్‌గా రూపొందింది. మాతృక‌తో పోల్చితే తెలుగులో నేటివిటీకి త‌గ్గట్లుగా చిన్న చిన్న మార్పులు చేసినా.. క‌థ మొత్తం యథాత‌థంగా చూపించే ప్రయ‌త్నం చేశారు. ఓ వృద్ధ జంట హ‌త్యకు గురి కావడం.. ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు శేఖ‌ర్ సహాయం కోర‌డం.. అతను రంగంలోకి దిగి త‌న తెలివి తేట‌ల‌తో నిమిషాల వ్యవ‌ధిలో నేర‌స్థుల్ని క‌నిపెట్టడం వంటి స‌న్నివేశాల‌తో ఆరంభం చ‌క‌చ‌కా సాగిపోతుంది. ఆ వెంట‌నే శేఖ‌ర్ ఫ్లాష్ బ్యాక్‌ను ప్రారంభించి.. అత‌ని వ్యక్తిగ‌త జీవితంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శకురాలు జీవిత‌.కానీ, అక్కడి నుంచి మొద‌ల‌య్యే శేఖ‌ర్ - కిన్నెర‌ల ప్రేమ క‌థ మ‌రీ రోటీన్‌గా అనిపిస్తుంది. ఇందుతో

'శేఖర్'

వైవాహిక జీవితానికి సంబంధించిన ఎపిసోడ్లు సైతం చ‌ప్పగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా? రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చూస్తున్నామా? అన్న అనుమానాలు రేకెత్తిస్తాయి. తండ్రీకూతురు అనుబంధాల నేప‌థ్యంగా వ‌చ్చే స‌న్నివేశాలు అక్కడ‌క్కడా గుండెల్ని హ‌త్తుకుంటాయి. ఇక విరామానికి ముందు ఇందు రోడ్డు ప్రమాదంలో చ‌నిపోవ‌డం.. అది ప్రమాదం కాదు హ‌త్య అని శేఖ‌ర్ క‌నిపెట్టడంతో ద్వితీయార్థంలో ఏం జ‌ర‌గ‌బోతుందా? అని ఆస‌క్తి పెరుగుతుంది. ప్రధ‌మార్థంతో పోలిస్తే ద్వీతియార్థం కాస్త ర‌స‌వ‌త్తరంగా ప‌రుగులు తీస్తుంది. ఇందు హ‌త్య కేసును ఛేదించే క్రమంలో శేఖ‌ర్ వేసే ఎత్తుగ‌డ‌లు అక్కడ‌క్కడా కాస్త రొటీన్‌గా అనిపించినా ఆద్యంతం ఉత్కంఠ‌ భ‌రితంగానే సాగుతాయి. శేఖ‌ర్ కుమార్తె కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందింద‌ని తెలిశాక‌.. ఇందు హ‌త్య కేసుపై ప్రేక్షకుల్లో మ‌రింత ఆస‌క్తి క‌లుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవ‌య‌వాల‌ను.. జీవ‌న్‌దాన్ వ్యవ‌స్థ ద్వారా వైద్య రంగంలోకి కొంద‌రు వ్యక్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పిన తీరు మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు గుండెల్ని బ‌రువెక్కిస్తాయి.

'శేఖర్'లో రాజశేఖర్, శివాని

ఎవ‌రెలా చేశారంటే:శేఖ‌ర్ పాత్రలో రాజ‌శేఖ‌ర్ చ‌క్కగా ఒదిగిపోయారు. వ‌య‌సు పైబ‌డిన వ్యక్తిలా ఆయ‌న క‌నిపించిన తీరు.. ప‌లికించిన హ‌వ‌భావాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి అన్నీ తానై ముందుకు న‌డిపించారు. ఆత్మీయ రాజ‌న్‌, ముస్కాన్, శివాని, అభిన‌వ్ గోమ‌ఠం త‌దిత‌రులు త‌మ పాత్ర ప‌రిధుల మేర న‌టించారు. అనూప్ రూబెన్స్ పాట‌లు విన‌సొంపుగా ఉన్నా.. వెంట వెంట‌నే రావ‌డం వ‌ల్ల క‌థ‌కు అడ్డు త‌గిలిన‌ట్లుగా అనిపిస్తాయి. నేప‌థ్య సంగీతం ఆద్యంతం మెప్పిస్తుంది. మ‌ల్లికార్జున్ ఛాయాగ్రహ‌ణం ఆక‌ట్టుకుంటుంది. అర‌కు అందాల్ని త‌న కెమెరాలో చ‌క్కగా ఒడిసిప‌ట్టారు. పతాక సన్నివేశాల్లో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ న్యాయవాది బలరాం పాత్రలో మెప్పించారు. దర్శకురాలిగా జీవిత రాజశేఖర్ కథను చక్కగా చెప్పడానికి ప్రయత్నించినా.. కథనంపై మరింత దృష్టి సారిస్తే బాగుండేది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గట్లుగా ఉన్నాయి.

బ‌లాలు:

+రాజశేఖ‌ర్ న‌ట‌న‌

+ఆయ‌న లుక్స్‌

+క‌థా నేప‌థ్యం

+ద్వితీయార్థం

+ప‌తాక స‌న్నివేశాలు

బ‌లహీన‌త‌లు:

-రొటీన్ ప్రేమ‌క‌థ‌

-ఫ్యామిలీ డ్రామా

-నెమ్మదిగా సాగే క‌థ‌నం

చివ‌రిగా:'శేఖ‌ర్'.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చే చిత్రం

Last Updated : May 20, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details