Satyadev Godsey movie: "నా దృష్టిలో కళ్లు ఉండీ వాస్తవాన్ని చూడలేని వాడే నిజమైన గుడ్డోడు. చెవులుండీ నిజాన్ని గ్రహించలేని వాడే అసలైన చెవిటోడు. గొంతుండీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని వాడే మూగోడు.... ఇలాంటి వారందరినీ ప్రతిబింబిస్తూ.. పోరాటం చేసేవాడే మా గాడ్సే" అన్నారు గోపి గణేష్ పట్టాభి. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రమే 'గాడ్సే'. ఈనెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు గోపి గణేష్. ఆ సంగతులివీ..
"బ్లఫ్‌మాస్టర్ తర్వాత నేను.. సత్యదేవ్ కలిసి చేసిన రెండో చిత్రమిది. మన దేశంలో 6.3శాతం మందే చదివిన చదువుకు తగ్గ అర్హత కలిగిన ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన 93.7శాతం మంది వాళ్ల చదువుకు సంబంధం లేని ఉద్యోగాలే చేస్తున్నారు. పాతికేళ్లు కష్టపడి చదివిన చదువు.. మనకు ఆ తర్వాత పాతికేళ్లకు ఎందుకూ ఉపయోగపడకపోతే 25ఏళ్ల జీవితం, శ్రమ వృథా అయినట్లే కదా. 'ప్రతి ఎన్నికలకు ముందు 2-3లక్షల ఉద్యోగాలిస్తామంటూ మభ్య పెట్టి.. ఆ నిరుద్యోగుల ఓట్లతో రాజకీయ నిరుద్యోగులొచ్చి అధికారంలో కూర్చుంటున్నార'ని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అది నిజంగానే జరుగుతోంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎవరం ప్రశ్నించం. ఇలా అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలను 'గాడ్సే' ప్రశ్నిస్తాడు".●