తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చనిపోయే ముందు ఆ నటుడికి వయాగ్రా ఇచ్చారా?.. మహిళ సంచలన ఆరోపణలు - సతీష్ కౌశిక్ ఫామ్​హౌస్ డ్రగ్స్

బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మృతి పలు అనుమానాలకు కారణమవుతోంది. చనిపోయిన ముందు రోజు ఆయన హోలీ వేడుకలు జరుపుకున్న ఫామ్​హౌస్​లో అనుమానిత ఔషధాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఫామ్​హౌస్ యజమాని రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు.

SATISH KAUSHIK DEATH MYSTERY
SATISH KAUSHIK DEATH MYSTERY

By

Published : Mar 12, 2023, 2:38 PM IST

సీనియర్ నటుడు సతీశ్ కౌశిక్ అకాల మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ ఫామ్​హౌస్​లో జరిగిన పార్టీకి హాజరైన తర్వాత ఆయన ఆనారోగ్యానికి గురికావడం.. అక్కడ అనుమానాస్పద ఔషధాలు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫామ్​హౌస్ యజమాని వికాస్ మాలు రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు, సతీశ్ కౌశిక్​కు డబ్బు విషయంలో గొడవ జరిగిందని ఆరోపించారు. రష్యన్ అమ్మాయిలను సతీశ్​కు ఎరగా వేస్తానని తన భర్త చెప్పాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే సతీశ్ మరణించడం వల్ల అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

"ఓ పార్టీ కోసం సతీశ్ కౌశిక్ నా భర్త ఫామ్​హౌస్​కు వచ్చారు. అక్కడే ఆయన ఆరోగ్యం క్షీణించింది. సతీశ్​కు నా భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. గతేడాది ఆగస్టులో వాగ్వాదానికి దిగారు. గతంలో ఇచ్చిన రూ.15 కోట్లు తిరిగి ఇవ్వాలని నా భర్తను సతీశ్​ కౌశిక్ డిమాండ్ చేశారు. భారత్​కు వచ్చిన తర్వాత డబ్బు ఇస్తానని నా భర్త చెప్పారు. నేను డబ్బు విషయం గురించి నా భర్తను అడిగా. సతీశ్ నుంచి డబ్బు తీసుకున్నానని.. కరోనా సమయంలో నష్టాల వల్ల ఆ డబ్బు పోగొట్టుకున్నానని నా భర్త నాతో చెప్పారు. వయాగ్రా ఔషధాలు, రష్యన్ అమ్మాయిలను ఉపయోగించి కౌశిక్​ సమస్యను పరిష్కరించుకుంటానని నాతో అన్నారు. ఈ విషయాలన్నీ చెప్పాలని నేను పోలీసులను కలిశా. ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరా."
-ఫామ్​హౌస్ యజమాని భార్య

దావూద్ ఇబ్రహీం వంటి అండర్​వరల్డ్ డాన్​లతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 'అనాస్ అనే వ్యక్తి ఫామ్​హౌస్​కు తరచుగా వచ్చేవాడు. అతడు దావూద్ ఇబ్రహీం కొడుకు అని వికాస్ స్వయంగా నాతో చెప్పాడు. ఆ ఫామ్​హౌస్​కు తరచుగా వచ్చే మరో వ్యక్తి ముస్తఫా. అతడు దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అని వికాస్ చెప్పాడు. ఇలా ఫామ్​హౌస్​కు వచ్చే కొందరి ఫొటోలు సైతం నా దగ్గర ఉన్నాయి' అని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. నైరుతి దిల్లీ జిల్లాకు చెందిన ఇన్​స్పెక్టర్ స్థాయి అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మార్చి 9న కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. ముందు రోజు (మార్చి 8న) ఆయన తన స్నేహితులతో కలిసి దిల్లీలోని ఫామ్​హౌస్​లో ఉల్లాసంగా గడిపారు. ఆ రోజు ఘనంగా హోలీ జరుపుకున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ గడిపారు. ఆ రోజు 9.30 గంటలకు నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. దీంతో కౌశిక్ మేనేజర్.. ఆయన్ను గురుగ్రామ్​లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సీపీఆర్ చేశారు. కానీ, ఆయన ప్రాణాలు నిలవలేదు. 1.43 గంటల సమయంలో కౌశిక్ కన్నుమూశారు.

హోలీ వేడుకలు జరిగిన ఆ ఫామ్​హౌస్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సతీశ్ కౌశిక్​ది సాధారణ మరణమేనని పోస్టు మార్టం నివేదికలో తేలిందని చెప్పారు. 'కార్డియాక్ అరెస్టు వల్లే ఆయన చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆయనకు మధుమేహం ఉంది. హైపర్​టెన్షన్​ సమస్యతో బాధపడుతున్నారు' అని వివరించారు. అయితే, దర్యాప్తు నిమిత్తం ఫామ్​హౌస్​కు వెళ్లిన పోలీసులకు.. పలు ఔషధాలు లభ్యమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిని పరీక్షలకు పంపినట్లు తెలిపాయి. అవి నిషేధిత ఔషధాలు కావని పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details