Sarkaru vaari paata director: 'గీత గోవిందం'తో సంచలన విజయం సాధించిన దర్శకుడు పరశురామ్. ఆ విజయమే ఆయనకి మహేష్‌తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
ఈ కథ ఎలా పుట్టింది?
'గీత గోవిందం' ఇంకో నెలలో విడుదలవుతుందనగా ఈ కథ అనుకున్నా. ఆ సినిమా విడుదల తర్వాత మహేష్‌బాబుని దృష్టిలో ఉంచుకునే సిద్ధం చేశా. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది.
మహేష్‌కి ఈ కథ చెప్పినప్పుడు ఆయన స్పందనేంటి?
ఆయనకి కథ ఎంతగా నచ్చిందో, ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానమూ అంతే నచ్చింది. ఈ సినిమా చేయడానికి ఓ బలమైన కారణం అది. పాత్ర మొదలుకొని సంభాషణలు చెప్పడం వరకు అన్నీ కొత్తగా ఉంటాయి. ఇది వాణిజ్య వినోదంతో కూడిన కథే. హీరో లుక్స్, ఆ పాత్రని ఆవిష్కరించిన తీరు మరో స్థాయిలో ఉంటుంది. పెద్ద దర్శకులు ఉండగా, పరశురామ్‌కి అవకాశం ఎందుకిచ్చారా? అనే సందేహం అభిమానుల్లో రావొచ్చు. ఇది చూశాక అది ఎందుకనేది తెలుస్తుంది. అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులూ మెచ్చేలా ఉంటుందీ చిత్రం. హీరోయిన్ పాత్రకి కీర్తిని ఎందుకు ఎంపిక చేశామో సినిమా చూశాక అర్థమవుతుంది. ఆమెకు మంచి పేరొస్తుంది. సముద్రఖని, తమన్ సంగీతం... ఇలా అందరి పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
అప్పుని ఆడపిల్లతో పోల్చారు, ఈ కథకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
అప్పుని ఆడపిల్లతో పోల్చడంలోనే అసలు కథ ఉంది. రెండు విభిన్నమైన ఆలోచనల మధ్య సాగుతుంది. ఇక స్ఫూర్తి అంటారా? ఇందులో ఏ వ్యక్తి, వ్యవస్థ గురించీ ఉండదు. ఒక మంచి ఉద్దేశంతో చెబుతున్న కథ ఇది. సరదాగా ముందుకు నడుపుతూనే చెప్పాల్సింది బలంగా చెప్పే ప్రయత్నం చేశా. సందేశం ఇవ్వడం అంటూ ఉండదు కానీ, ఆఖర్లో ఓ బలమైన ఉద్దేశాన్ని చాటి చెబుతుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది.
ఈ చిత్రాన్ని చాలామంది 'పోకిరి'తో పోల్చి చూసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
'పోకిరి' బయటికి కనిపించని ఓ పోలీస్ అధికారి కథ. ఇది కామన్ మేన్ కథ. ఇందులో మరికొంచెం ఎక్కువగా ఓపెన్ అయినట్టు కనిపిస్తారు మహేష్. ఆయన మేనరిజమ్, లుక్, హావభావాలు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతారు. ఆయన డ్యాన్స్‌లు ఉర్రూతలూగిస్తాయి. బ్యాంక్ నేపథ్యంలో కథ సాగినా మహేష్ మాత్రం బ్యాంక్ ఉద్యోగి కాదు. ఆయన ఒంటిపై కనిపించే పచ్చబొట్టు వెనకా ఓ కథ ఉంటుంది.