తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Michael Review: వైలెన్స్​ ఓవర్​లోడెడ్​.. సందీప్​ కిషన్​ 'మైఖేల్'​ ఎలా ఉందంటే? - సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ హీరోయిన్

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందంటే..

Sandeep kishan Mikhael movie review
Michael Review: సందీప్​ కిషన్​ 'మైఖేల్'​ ఎలా ఉందంటే?

By

Published : Feb 3, 2023, 4:38 PM IST

చిత్రం: మైఖేల్‌; నటీనటులు: సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌, విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, అనసూయ, వరుణ్‌ సందేశ్‌, అయ్యప్ప పి.శర్మ, అనీష్‌ కురవిల్లా తదితరులు; సంగీతం: సామ్‌ సిఎస్‌; ఛాయాగ్రహణం: కిరణ్‌ కౌశిక్‌; నిర్మాతలు: భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు; దర్శకత్వం:రంజిత్‌ జయకోడి; విడుదల తేదీ:03-02-2023

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తున్నారు సందీప్‌ కిషన్ (Sundeep Kishan)‌. ఇప్పుడాయన ‘మైఖేల్‌’ (Michael)తో పాన్‌ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఓ భారీ యాక్షన్‌ కథాంశాన్ని.. దానికి తగ్గట్లుగా విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), గౌతమ్‌ మేనన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ వంటి భారీ తారాగణాన్ని ఎంచుకొని పక్కాగా రంగంలోకి దిగారు. టీజర్లు, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా తెరపై ఎలాంటి అనుభూతిని అందించింది? ‘మైఖేల్‌’గా సందీప్‌ పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటారా? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Michael Review).

కథేంటంటే: జైలులో పుట్టి.. అక్కడే పెరిగిన వాడు మైఖేల్‌ (సందీప్‌ కిషన్‌) (Sundeep Kishan). తన తండ్రిని చంపడమే లక్ష్యంగా ముంబయిలో అడుగు పెడతాడు. అతను వచ్చీ రాగానే ముంబయి నేర సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిగా ఉన్న గురునాథ్‌ (గౌతమ్‌ మేనన్‌)ను ఓ భారీ ఎటాక్‌ నుంచి రక్షిస్తాడు. తనని కాపాడినందుకు కృతజ్ఞతగా మైఖేల్‌ను తన దగ్గరే ఉంచుకుంటాడు గురు. తనని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తుల్లో రతన్‌ (అనీష్‌ కురువిల్లా)ను తప్ప మిగతా అందర్నీ చంపిన గురునాథ్‌.. ఆ మిగిలిన ఒక్కడ్ని, అతడి కూతురు తీర (దివ్యాంశ కౌశిక్‌)ను చంపే బాధ్యతను మైఖేల్‌ చేతిలో పెడతాడు. అయితే రతన్‌ను వెతికి పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన అతడు.. తొలుత తీరకు దగ్గరవుతాడు. ఆ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత రతన్‌ దొరికినా చంపకుండా వదిలేస్తాడు. ఆ సమయంలో గురునాథ్‌ తనయుడు అమర్‌నాథ్‌ (వరుణ్‌ సందేశ్‌) గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకుంటాడు. మరి అదేంటి? రతన్‌ను చంపకుండా వదిలేసిన మైఖేల్‌ను గురునాథ్‌ ఏం చేశాడు? అసలు మైఖేల్‌ జైలులో ఎందుకు పుట్టాడు? తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? అతని కథకు గురునాథ్‌.. అతని భార్య చారులత (అనసూయ)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ల పాత్రలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి (Michael Review).

ఎలా సాగిందంటే: చరిత్రలో యుద్ధాలన్నీ మగువ కోసమే జరిగాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఈ చిత్ర కథా నేపథ్యం కూడా అదేనని ప్రచార చిత్రాలతోనే స్పష్టత ఇచ్చారు దర్శకుడు. అయితే టీజర్‌, ట్రైలర్లలో ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు చేసిన మారణకాండలా దీన్ని చూపించారు కానీ, నిజానికి ఇందులో మరో ఆసక్తికర కథ కూడా దాగి ఉంది. అదేంటన్నది తెరపైనే చూడాలి. 1980-90ల మధ్య కాలంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచంలో సెట్‌ చేసిన కథ ఇది. దీనికి ప్రేమతో పాటు తల్లి సెంట్‌మెంట్‌ను జోడించి భావోద్వేగభరితంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ రెండింటి మేళవింపు బాగున్నా.. దాన్ని చక్కటి సంఘర్షణతో ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాని రెట్రో స్టైల్‌లో తెరకెక్కించిన విధానం బాగుంది. మైఖేల్‌ పాత్ర పరిచయ సన్నివేశాలు, సంభాషణలతో కథను నడిపించిన విధానం ‘కెజీయఫ్‌’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అందులో కనిపించే రేసీ స్క్రీన్‌ప్లే ఇందులో ఏమాత్రం కనిపించదు. గురునాథ్‌ను మైఖేల్‌ కాపాడటం.. క్రమంగా అతనికి దగ్గరవ్వడం.. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ గురు సామ్రాజ్యంలో తను చక్రం తిప్పడం.. మరోవైపు గురునాథ్‌ను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుండటం.. ఇలా ఆరంభంలో కథ కాస్త రసవత్తరంగానే సాగుతుంది. కానీ, ఆ ఆసక్తిని ఆద్యంతం కొనసాగించలేకపోయారు. రతన్‌ను చంపేందుకు మైఖేల్‌ దిల్లీకి వెళ్లడం.. అక్కడ తీరతో ప్రేమలో పడటం.. ఆయా సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా బోరింగ్‌గా అనిపిస్తాయి. అసలు మైఖేల్‌ - తీరల మధ్య ప్రేమలో ఏమాత్రం ఫీల్‌ కనిపించదు. దీంతో వారి కథకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్‌ కాలేరు. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచేలా చేస్తుంది (Michael Review).

అయితే ప్రథమార్ధంలో కాస్తోకూస్తో ఆసక్తికరంగా సాగిన కథ.. ద్వితీయార్ధంలో పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది. మైఖేల్‌ గతం ఏమాత్రం ఆసక్తిరేకెత్తించదు. అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ పాత్రలు ఎంట్రీ ఇచ్చాక సినిమా కాస్త రసవత్తరంగా మారుతుంది. వారి పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటాయి. పతాక సన్నివేశాలు సాగతీతగా ఉంటాయి. చివరి 15నిమిషాలు యాక్షన్‌ హంగామా, బుల్లెట్ల మోతే కనిపిస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: మైఖేల్‌ (Michael Review) పాత్ర కోసం సందీప్‌ తన లుక్‌ను మార్చుకున్న తీరు మెచ్చుకుని తీరాల్సిందే. అయితే అతను ఆ పాత్రలో లీనమైనా తన నటన ఎందుకో కొంచెం కృత్రిమంగానే అనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. తీరగా దివ్యాంశ నటన ఓకే. తెరపై అందంగా కనిపించినా.. అభినయించే అవకాశం పెద్దగా దొరకలేదు. మాఫియా డాన్‌గా గురునాథ్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్రను చూపించిన విధానం బాగుంది. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్‌ను చూపించిన తీరు కూడా మెప్పిస్తుంది. తను ఇకపై ఆ తరహా పాత్రలకు పూర్తిగా షిఫ్ట్‌ అయిపోవచ్చు. అనసూయ పాత్ర కాస్త అతిగా అనిపిస్తుంది. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ పాత్రలకు కథలో అంత ప్రాధాన్యం లేకున్నా.. వాళ్లు ఉన్న కొద్దిసేపూ తమదైన నటనతో అలరిస్తారు. దర్శకుడు రంజిత్‌ తీర్చిదిద్దుకున్న కథలో కొత్తదనం లేదు. అయితే మేకింగ్‌ స్టైల్‌, కథనాన్ని నడిపించిన తీరు కొంతమేర మెప్పిస్తాయి. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతమే. బలం లేని సన్నివేశాలకు సైతం తనదైన నేపథ్య సంగీతంతో ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. కిరణ్‌ కౌశిక్‌ ఛాయాగ్రహణం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు:
1. కథనం నడిపిన తీరు, 2. నేపథ్య సంగీతం, 3. పోరాట ఘట్టాలు

బలహీనతలు:

1.కొత్తదనం లేని కథ, 2.మితిమీరిన హింస

చివరగా:కొత్తదనం లేని ప్రతీకార కథ.. ‘మైఖేల్‌’(Michael Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details