సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై సామ్ స్పందించింది. తాను నటించిన 'యశోద' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్ ఉండటం గమనార్హం.
"యశోద ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి "మయోసిటిస్" అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. కాస్త ఆలస్యమైనా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరొక్క రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ" అని సమంత ట్వీట్ చేశారు.
గత కొంతకాలంగా అటు, సినిమాలకు, ఇటు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు సమంత. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తలపైనా స్పందించలేదు. తాజాగా "యశోద"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తన అనారోగ్యం గురించి సమంత స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలోనూ సామ్ నటిస్తున్నారు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.