తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి'.. విడాకులపై సమంత కామెంట్స్ - విడాకులపై సమంత కామెంట్స్

హీరోయిన్​ సమంత తన విడాకుల విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ మీడియా ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్​ తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా 'పుష్ప'లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడంపై కూడా స్పందించారు.

samantha
samantha

By

Published : Mar 29, 2023, 2:56 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత తన విడాకుల విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయతీతో ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్‌ కాలేదని తెలిపారు. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'శాకుంతలం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సామ్​.. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ మీడియా ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్​ తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా 'పుష్ప'లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడంపై కూడా స్పందించారు.

"వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే నాకు 'పుష్ప'లో 'ఊ అంటావా' ఆఫర్‌ వచ్చింది. నేను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని అనిపించింది. వెంటనే దాన్ని ఓకే చేసేశాను. ఆ పాటను అనౌన్స్‌ చేసినప్పుడు కుటుంబసభ్యులు, సన్నిహితులు నాకు ఫోన్లు చేసి.. "ఇంట్లో కూర్చో చాలు. విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడం బాగోదు" అంటూ సలహాలు ఇచ్చారు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దనే చెప్పారు. కానీ నేను దానికి సమ్మతించలేదు. ఎందుకంటే.. వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయతీగానే ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్‌ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని, ఎందుకు బాధపడాలి?" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

"నేను ఇప్పటికే ఎన్నో బాధలుపడ్డాను. ఓ హీరోయిన్​గా ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్‌, మెడికేషన్‌ కారణంగా నాపై నాకే కంట్రోల్‌ లేకుండా పోయింది. దానివల్ల ఒక్కోసారి నేను నీరసంగా కనిపించవచ్చు, ఒక్కోసారి బొద్దుగా కనిపించవచ్చు. నేను స్టైల్‌ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే అది నిజం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదు. ఎందుకంటే కళ్లతోనే నటీమణులు పలు భావాలు పలికించాలి. గడిచిన ఎనిమిది నెలలుగా ప్రతి రోజూ నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. బాధను అనుభవిస్తూనే ఉన్నాను. అన్నింటినీ దాటుకుని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి, ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్‌ గురించి కామెంట్స్‌ చేసినా నేను పెద్దగా పట్టించుకోను" అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details