ఓటీటీ ప్లాట్‌ఫామ్ కారణంగా గతకొంత కాలంగా కొరియన్ వెబ్‌సిరీస్, మూవీస్‌కు ఆదరణ ఎక్కువగా దక్కుతోంది. అయితే ఇప్పటికే అక్కడ తెరకెక్కిన పలు సినిమాలను ఇక్కడ రీమేక్ చేయడం ప్రారంభించారు మన దర్శకనిర్మాతలు. అయితే తాజాగా ఈ విషయమై నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. త్వరలోనే ఆరు కొరియన్ సినిమాలను రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ సంగతులేంటో చూద్దాం..
కథల్ని ఇచ్చి పుచ్చుకోవడానికి భాషతో సంబంధం లేదు. దేశం ఏదైనా.. భాష ఏదైనా భావోద్వేగాలు మాత్రం ఒక్కటే. అందుకే 'సినిమా బాగుంది' అనే మాట వినిపిస్తే చాలు... మన దర్శకనిర్మాతలు ప్రపంచంలో ఏ మూల కథల్నైనా సరే తీసుకొచ్చేస్తుంటారు. 'ఓ బేబీ'తో సహా కొన్నేళ్లుగా తెలుగులో కొరియన్ కథల జోరు కనిపిస్తోంది. అక్కడ విజయవంతమైన 'మిడ్నైట్ రన్నర్స్'కు రీమేక్‌గా ఇటీవల 'శాకిని డాకిని' తెరకెక్కింది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రధారులుగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సునీత తాటి విలేకర్లతో చిత్ర విషయాలను తెలిపారు.
"నిర్మాతగా ఇది నా 7వ చిత్రం. మాతృకలో ఇద్దరబ్బాయిల కథ ఇది. మేం కూడా ఇద్దరు హీరోలతోనే చేయాలనుకున్నాం కానీ, బ్యాలెన్స్ కుదరలేదు. దాంతో అమ్మాయిల కోసమని కథలో మార్పు చేర్పులు చేశాం. పోలీసులుగా శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువతుల నేపథ్యంలో, ప్రధానంగా ఒక రాత్రి జరిగే సంఘటనల చుట్టూ సాగే కథ ఇది. సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చర్చించాం. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వాళ్ల పిల్లలతో కలిసి చూసేలా ఉంటుంది మా చిత్రం".