Sharukh Mannat: సినీ సెలబ్రిటీల ఇళ్లు ఎంత లగ్జరీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ తమ అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకుంటారు. అయితే వీటిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు చెందిన బంగలా మన్నత్ చాలా ప్రత్యేకం. దాదాపు రూ.200కోట్లు విలువ చేసే ఈ బంగలా సముద్రానికి ఎదురుగా.. ప్రకృతి అందాల మధ్య.. ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. అంతేకాదు ఆరు అంతస్తుల బిల్డింగ్‌కు షారుక్ భార్య గౌరీఖాన్ ఎన్నో కోట్లతో అదిరిపోయే ఇంటీరియర్ డెకరేషన్ చేయించారు. అయితే తాజాగా ఈ ఇంటికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్ భాయ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఇంటిపై అప్పట్లో కన్నేశారట. తన స్నేహితుడు ఇంటిపై ఆయన కన్నేయడం ఏంటీ అని మీకు అనుకుంటున్నారా? ఈ లగ్జరీ హౌస్‌ను షారుక్ కన్నా ముందే భాయ్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారట. కానీ ఆయన తండ్రి.. ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పడం వల్ల సల్మాన్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. ఈ విషయాన్ని సల్మాన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. "కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న తొలి రోజులవి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ బంగ్లాను చూస్తే ముచ్చటేసేది. ఆ ఇల్లు ఎలాగైనా కొనాలి అని అనుకునేవాడిని. సరిగ్గా అది అమ్మకానికి పెట్టినప్పుడు మొదట ఆ ఇంటిని కొనమని నా దగ్గరకే వచ్చారు. కొనడానికి అన్ని రెడీ చేసుకుంటున్న సమంయలో నాన్న వద్దని సలహా ఇచ్చారు. దాంతో నా ప్రయత్నం విరమించుకున్నాను" అని సల్మాన్ చెప్పారు. అయితే తను మిస్ చేసుకున్న ఈ ఇంటిని తన స్నేహితుడు షారుక్ కొనుగోలు చేయడం సంతోషంగా ఉందన్నారు సల్మాన్.