Salman Khan Tiger 3 Movie : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీడ్లో తెరకెక్కిన యాక్షన్ మూవీ 'టైగర్-3' టైగర్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 12న దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో తో పాటు అన్నీంటికి బారులు తీశారు. అయితే మహారాష్ట్రాలోని ఓ థియేటర్లో మాత్రం కొంత మంది అభిమానులు బాణసంచా కాల్చుతూ హంగామా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వగా.. అది హీరో సల్మాన్ ఖాన్ దృష్టికి వెళ్లింది. ఇక ఆయన ఈ వీడియో పై స్పందించారు. తమ అభిమానులు చేసిన ఈ చర్య పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ఇకపై చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
"టైగర్-3 సినిమా ప్రదర్శితమవుతున్న సందర్భంగా థియేటర్ల లోపల బాణసంచా కాల్చుతున్న విషయం తెలిసింది. ఇది చాలా ప్రమాదకరం. మన ప్రాణాలను, ఇతర ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా, హాయిగా సినిమాను ఆస్వాదిద్దాం. జాగ్రత్తగా ఉండండి" అంటూ సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు.