బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్వయంగా తనకు కాల్ చేసి.. తన సినిమాలో ఒక పాట కంపోజింగ్ చేయాలంటూ అడిగారని సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న నాలుగో పాట 'లెట్స్ డాన్స్ చోటు మోటు'. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్న 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రంలోనిది ఈ పాట. ఈ సాంగ్‌ను రీసెంట్గా రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రతిఒక్కరు పట్టు పంచెలు, లంగా ఓణీలు ధరించి దక్షిణాది సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీనిని దేవి శ్రీ ప్రసాద్ స్వర పరుచగా హనీసింగ్ ఆలపించారు. తెలుగు బిట్‌ను దేవి ఆలపించారు. ఈ సందర్భంగా దేవీ శ్రీ ప్రసాద్.. సల్మాన్‌తో తనకున్న బంధాన్ని తెలిపారు.
"సల్మాన్ భాయ్ నా ప్రతిభను గుర్తించి నాకు 'డింకచిక డింకచిక' పాటను చేసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నా హార్డ్ వర్క్ పట్ల ఆయన నమ్మకముంచేవారు. ఆయన సినిమాలకు పనిచేయాలని చాలా సార్లు ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేసేవారు. సీటీమార్, జయహో పాట చేసే సమయంలో ఆయనతో గడిపిన క్షణాల్ని ఎంజాయ్ చేశాను. అప్పటినుంచి సల్మాన్ భాయ్‌తో ప్రత్యేక బంధం ఏర్పడింది" అని దేవీ శ్రీ తెలిపారు. కాగా, అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో డింకచిక, నాచోరే, సీటీమార్ మూడు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఓహ్ జానే జానా, తెరె మస్త్ మస్త్ దో నేన్, జుమ్మేకి రాత్ హై పాటల్లో సల్మాన్ వేసిన సిగ్నేచర్ స్టెప్పులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇప్పుడు లెట్స్ డాన్స్ చోటు మోటులోని హుక్ స్టెప్ కూడా అలానే ఎప్పటికీ అందరి మదిలో గుర్తుండిపోతుందని అన్నారు దేవీ శ్రీ. ప్రతిఒక్కరూ ఈ పాటను కచ్చితంగా ఆదరిస్తారని అని అన్నారు.