మహిళల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమైన 'ఆప్ కీ అదాలత్' అనే టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సల్మాన్‌తో కలిసి 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్'లో ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న నటి పాలక్ తివారీ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. "సల్మాన్ తన సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా వస్త్రాలు ధరించేలా చూస్తారు" అని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన నెటిజన్లు సల్మాన్‌పై విమర్శలను గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'ఆప్ కీ అదాలత్' వ్యాఖ్యాత రజత్ శర్మ సల్మాన్‌ను ఓ ప్రశ్న అడిగారు. "మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టే మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటించడం ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా?" అని అడిగారు. "ఇందులో ద్వంద్వ ప్రమాణాలు లేవు. నా అభిప్రాయంలో మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లులు, భార్యలు, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను" అని ఆ వ్యాఖ్యాత ప్రశ్నకు సల్మాన్ వివరణ ఇచ్చారు.