Salaar Tickets Rate : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'సలార్'కు తెలంగాణలో టికెట్ ధరలు పెరిగాయి. గతంలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షో, ఎక్స్ట్రా షోలకు అనుమతి ఇవ్వాలంటూ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఆ దరఖాస్తును పరిశీలించిన హోంశాఖ అనుమతిని ఇస్తున్నట్లు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది.
ఇందులో భాగంగా మల్టీఫ్లెక్స్‌లో గరిష్టంగా రూ. 100, సాధారణ థియేటర్లలో గరిష్టంగా రూ. 65 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే మొదటి వారం రోజులు మాత్రమే ఈ కొత్త ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
మరోవైపు తొలి రోజు రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చింది. సాధారణ షోస్‌తో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆటను తెరపై చూపించేందుకు డిస్ట్రిబ్యూటర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ టికెట్ ధరలు స్వల్పంగా పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులు మాత్రమే రూ. 40 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవలే 'సలార్' సినిమా మొదటి టికెట్‌ను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లోని ఉదయం 7 గంటల షో టికెట్‌ను ఆయన కొన్నారని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ ప్రకటించింది.