Salaar Tickets BookMyShow Servers Crash :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన మూవీ సలార్. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దీంతో మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నారు. అయితే తెలంగాణ, ఏపీ థియేటర్లలో టికెట్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం- జనాలు బుక్ మై షో యాప్ మీద పడ్డారు.
యాప్ క్రాష్!
ఒక్కసారిగా వేలాది, లక్షలాది మంది యాప్ ఓపెన్ చేయడంతో యాప్ కాసేపు పని చేయలేదు. క్రాష్ అయ్యింది. ఆ తర్వాత బుక్ మై షో క్రాష్ అయిన ఫొటోలు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఆ లిస్టులో బాహుబలి చిత్ర నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా ఉన్నారు. సలార్ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది.
నైజాంలో కౌంటర్ల వద్ద టికెట్లు!
మరోవైపు, నైజాంలో మైత్రీ మూవీ సంస్థ కేవలం మల్టీప్లెక్స్ టికెట్లను మాత్రమే ఆన్లైన్లో పెట్టింది. సింగిల్ స్క్రీన్ టికెట్లను కౌంటర్ల వద్ద అమ్మకాలు ప్రారంభించింది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొందరు ఫ్యాన్స్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మైత్రీ సంస్థపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడ్డారు. 21వ సెంచరీలో కూడా టికెట్లు కౌంటర్ల దగ్గర అమ్మడమేంటని ప్రశ్నించారు.