తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాస్​ ఎంటర్​టైనర్​గా 'సలార్​' - ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా? - సలార్ మూవీ డైరెక్టర్

Salaar Review In Telugu : రెబల్​ స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'సలార్​'. ప్రశాంత్​ నీల్​ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్​ వైడ్​గా శుక్రవారం గ్రాండ్​గా రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Salaar Review In Telugu
Salaar Review In Telugu

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 9:31 AM IST

Salaar Review In Telugu :చిత్రం: సలార్‌: పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌; నటీనటులు: ప్రభాస్‌,శ్రుతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు; సంగీతం: రవి బస్రూర్‌; ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి; సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ; నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌; రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌; విడుదల: 22-12-2023

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్‌- ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'స‌లార్'. ఎప్ప‌ట్నుంచో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ గ్రాండ్​గా రిలీజ్​ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే :
ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి క‌ర్త రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తి బాబు). ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ దొర‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆ సమయంలోనే క‌ర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. నేనుండ‌గా నా కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని దొర‌గా చూడాలి అంటూ త‌న కోరిక‌గా చెబుతాడు రాజ‌మ‌న్నార్. కొన్నాళ్లు ఆయ‌న త‌న సామ్రాజ్యాన్ని వ‌దిలి తిరిగొచ్చేలోపు ఖాన్సార్ స్టోరీ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు ప‌తాక స్థాయికి చేరుకునే సరికి వ‌ర‌ద రాజ‌మ‌న్నార్‌ని అంతం చేయ‌డం వ‌ర‌కూ వెళుతుంది ఈ వ్య‌వ‌హారం. దీంతో మిగ‌తా దొర‌లంతా త‌మ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. అయితే వ‌ర‌ద మాత్రం త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌ మంది సైన్యాన్ని ఎలా ఎదురించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌డికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? 25 యేళ్ల‌పాటు ఊళ్లు ఊళ్లు మారుస్తూ త‌ల్లితో క‌లిసి ఒడిశా ఓ మారుమూల ప‌ల్లెలో త‌ల‌దాచుకోవ‌ల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతి హాస‌న్ ) ఎలా వ‌చ్చింది? అనేది మిగతా స్టోరీ

ఎలా ఉందంటే:
ప్రభాస్, ప్ర‌శాంత్ నీల్​ కాంబో నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశించారో ఆ హంగుల‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కె.జి.ఎఫ్ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక‌మైన ముద్ర వేశారు ప్ర‌శాంత్‌ నీల్​. క‌థ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్ర‌త్యేకమైన ఆ ప్ర‌పంచాన్ని, ప‌తాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్‌గా తెర‌పై ఆవిష్క‌రించిన విధానం ప్రేక్ష‌కుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సారి కూడా అదే త‌ర‌హాలో ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ ఈ క‌థ‌ను అల్లారు. కె.జి.ఎఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చారు. అలాగ‌ని హీరోయిజానికీ త‌క్కువేమీ చేయ‌లేదు. అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా మంచి ఎలివేష‌న్ల‌తో ప్ర‌భాస్‌ని చాలా రోజుల త‌ర్వాత అభిమానుల‌కి న‌చ్చేలా చూపించారు.

అయితే సెకెండాఫ్​ కాస్త గంద‌ర‌గోళంగా అనిపించినప్పటికీ స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామా ఉండ‌టం ఈ సినిమాకి క‌లిసొచ్చిన అంశం. చెప్పాల్సిన క‌థ ఇంకా మిగిలే ఉన్నప్ప‌టికీ అధికార కాంక్ష‌, స్నేహం, ప్ర‌తీకారం చుట్టూ సాగిన సినిమా ఆడియెన్స్​ను ఆక‌ట్టుకుంటుంది. చిన్న‌నాటి స్నేహాన్ని చూపిస్తూ క‌థ‌ని మొద‌లుపెట్టిన నీల్​ ఇదే క‌థ‌ని వెయ్యేళ్ల కింద‌టి చ‌రిత్ర‌తో ముడిపెడుతూ చూపించ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.

పాత్ర‌ల్ని, క‌థా ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తూ మెల్ల‌గా అస‌లు క‌థ‌లోకి వెళుతుంది. అలా ప్ర‌థ‌మార్థంలోనూ, ద్వితీయార్థంలోనూ చాలా సేప‌టివ‌ర‌కూ హీరోయిజం క‌నిపించ‌దు. ఫస్ట్​హాఫ్​లో ఈశ్వ‌రీరావు, సెకెండాఫ్​లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లు హీరో పాత్ర‌ని నియంత్రిస్తూ క‌నిపిస్తాయి. అయితే ఒక్క‌సారి చేతికి క‌త్తి అందాక ఇక వెనుదిరిగి చూడ‌రు ప్ర‌భాస్‌. తనలోని హీరోయిజాన్ని టాప్‌గేర్‌లోకి తీసుకెళ్తార. ఎలివేష‌న్స్ కోసం అనుస‌రించిన ఈ వ్యూహం కూడా మెప్పించేదే. కాట‌మ్మ త‌ల్లికి బ‌లి ఇచ్చే సంద‌ర్భంగా వ‌చ్చే పోరాట ఘ‌ట్టం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అక్క‌డ మంచి ఎమోషన్స్​ పండాయి.

ఫస్ట్​హాఫ్​తో పోలిస్తే సెకెండాఫ్​లోనే అస‌లు క‌థ ఉన్న‌ప్ప‌టికీ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గంద‌ర‌గోళంగానే అనిపిస్తుంది. అయితే ప‌తాక స‌న్నివేశాల్లో ట్విస్ట్​ ఆసక్తికరంగా ఉంటుంది. ప్ర‌భాస్ అస‌లు పాత్ర అక్క‌డ ప‌రిచ‌యం కావ‌డం రెండో భాగం స‌లార్‌పై మరింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. శౌర్యాంగ ప‌ర్వంగా ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఎవ‌రెలా చేశారంటే:
ప్ర‌భాస్ కటౌట్‌ని ప‌క్కాగా వాడుకున్న డైరెక్టర్ల జాబితాలో ఇప్పుడు ప్ర‌శాంత్‌ నీల్ చేర‌తారు. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భాస్ త‌న అభిమానులు కోరుకున్నట్లుగా తెర‌పై క‌నిపించారు. ఆయ‌న క‌త్తి ప‌ట్టి ఎంత మందిని న‌రుకుతున్నా న‌మ్మేలా ఉందంటే కార‌ణం ఆ క‌టౌట్​. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని ఓ స్నేహితుడిగా అమాయ‌కంగా క‌నిపించిన విధానం అందరినీ ఆక‌ట్టుకుంటుంది. పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, ఆయ‌న హీరోయిజం, స్టైల్​ సూపర్​గా ఉంటుంది. బాగా డిజైన్ చేసిన ఆ స‌న్నివేశాల్ని అంతే అవ‌లీల‌గా చేశారు ప్ర‌భాస్‌.

ఇక శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్థంలో ఆమె కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. బాబీ సింహా, ఈశ్వ‌రీ రావు, జ‌గ‌ప‌తి బాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు కూడా ఆక‌ట్టుకుంటుంది.

రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఓ మామూలు క‌థ‌ని క‌ల్పిత ప్ర‌పంచం చుట్టూ అల్లి త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శించాడు ప్ర‌శాంత్‌. ద్వితీయార్థంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు. చాలా చోట్ల కె.జి.ఎఫ్ సినిమా గుర్తొచ్చినప్పటికీ ద్వితీయార్థంతో కొద్దివ‌ర‌కు డ్రామాని పండించ‌డంలోనూ, ప్ర‌భాస్‌కి త‌గ్గట్టుగా మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలోనూ ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

బ‌లాలు
ఖాన్సార్ చుట్టూ సాగే క‌థ‌

ప్ర‌భాస్ పృథ్వీరాజ్ పాత్ర‌లు, న‌ట‌న‌

భావోద్వేగాలు, డ్రామా

ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా..: స‌లార్‌.. ప్ర‌భాస్ యాక్ష‌న్ హంగామా

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

పవర్​ఫుల్​గా 'సలార్' సెకెండ్ సింగిల్​ - 'యుద్ధమైనా చిరునవ్వుతో గెలవరా'

15ఏళ్ల క్రితమే స్టోరీ లైన్​- 1000మందితో 'దేవ' ఫైట్​- ప్రభాస్, శ్రుతి సాంగ్​- సలార్​ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details