Salaar Movie Prabhas :రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సలార్'. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి హీరో డబ్బింగ్ విషయంలో మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే హిందీ భాషలో డబ్బింగ్ పూర్తి చేసుకుంది 'సలార్'. 'బాహుబలి'లో ప్రభాస్ పోషించిన అమరేంద్ర బాహుబలి పాత్రకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు శరద్ కేల్కర్‌తోనే 'సలార్'(హిందీ)లోనూ డబ్బింగ్ చెప్పించారు.
'సలార్'కు 'కేజీఎఫ్' విలన్ డబ్బింగ్..
ఇదిలా ఉంటే తాజాగా 'సలార్' కన్నడ వెర్షన్‌కు సంబధించి కూడా హీరో డబ్బింగ్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు.. కన్నడ స్టార్ నటుడు, కేజీఎఫ్ విలన్ 'వశిష్ఠ సింహా'. ఇతడు బ్లాక్‌బస్టర్ 'కేజీఎఫ్'లో విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా తన బేస్ వాయిస్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా దక్కాయి. అయితే వశిష్ఠ డబ్బింగ్ 'సలార్'కు ప్లస్ పాయింట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా 'సలార్' హీరో డబ్బింగ్ విషయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా నాణ్యత విషయంలో ఏ మాత్రం కూడా రాజీపడకుండా ముందుకు వెళ్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఐదు భాషల్లోనూ శ్రుతినే..
ఇక 'సలార్' హీరో డబ్బింగ్ విషయంలో ఒక్కో భాషలో ఒక్కో నటుడు డబ్బింగ్ చెప్తుంటే.. ఇందులో హీరోయిన్గా నటించిన శ్రుతి హాసన్ మాత్రం తన డబ్బింగ్‌ను తనే చెప్పుకుంటోంది. 'సలార్' సినిమా విడుదల కానున్న ఐదు భాషల్లోనూ శ్రుతియే డబ్బింగ్ చెప్తోన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో 'సలార్'కు మాత్రం ప్రభాసే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.