RRR Sunset Circle Awards 2022: 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని మన భారతీయ ప్రేక్షకులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏయే విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి? అనేది పక్కన పెడితే.. ముందుగా నామినేషన్స్ రావాలి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందులో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటుతుండటం శుభ పరిణామం అని చెప్పుకోవాలి.
ఆస్కార్‌కు ముందు RRRకు ఇంటర్నేషనల్ అవార్డులు.. దర్శకుడిగా రాజమౌళికి..
పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డులకు ముందు ఈ సినిమా సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో రెండు సొంతం చేసుకుంది. ఆ సంగతులు..
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో
అయితే 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు ఆ విభాగంలో మన సినిమా అవార్డులు అందుకుంటోంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' మరో నాలుగు ఇంటర్నేషనల్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో విజేతగా నిలిచింది. అంతే కాదు.. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శకధీరుడు రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో 'రన్నరప్'గా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'కు గాను ఆయనకు ఇది తొలి ఇంటర్నేషనల్ అవార్డ్.
ఆస్కార్ నామినేషన్స్‌కు ముందు
ఇంతకు ముందు కూడా 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. శాటన్ (50వ శాటన్ అవార్ట్స్) పురస్కారాల్లో విజేతగా నిలిచింది. ఆ అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్... ఇలా మూడు విభాగాల్లో నామినేషన్ లభించగా... ఒక్క అవార్డు వచ్చింది. ఇప్పుడు సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో రెండు వచ్చాయి. ఆస్కార్ నామినేషన్స్‌కు ముందు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' ఆ మధ్య జపాన్‌లో విడుదల అయ్యింది. రికార్డ్ కలెక్షన్స్ కూడా రాబట్టింది. రాజమౌళితో పాటు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ అక్కడ సందడి చేశారు. ఆ సమయంలో శాటన్ అవార్డు వచ్చింది.