గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'RRR' సంచలనం.. ఉత్తమ సాంగ్‌గా 'నాటు నాటు'
07:15 January 11
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సంచలనం.. ఉత్తమ సాంగ్‌గా 'నాటు నాటు'
'ఆర్‌ఆర్‌ఆర్'మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును 'ఆర్ఆర్‌ఆర్' సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి 'నాటు నాటు' పాటకు పురస్కారం వరించింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. 'నాటు నాటు'కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నా శ్రమను, మద్దతిచ్చినవారిని నమ్ముకున్నా: కీరవాణి
అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణి మాట్లాడారు. "గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్ ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు" అని తెలిపారు.
ఎన్టీఆర్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులను ఉద్దేశిస్తూ కల్పిత కథగా ఇది రూపుదిద్దుకుంది. యాక్షన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి నెలలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు అంతటా మంచి రెస్పాన్స్ లభించింది. విదేశీయులను సైతం ఈ పాట ఉర్రూతలూగించింది. చంద్రబోస్ ఈ పాటను రచించగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.