Oscar Jury Members 2023 : ఆస్కార్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ సారి అకాడమీ టీమ్.. ఆస్కార్ జ్యూరీలో మొత్తం 398 మంది కొత్త సభ్యులకి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించగా.. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేటగిరిలో మెంబర్స్‌గా స్థానం దక్కించుకున్నారు.
ఇక సంగీత విభాగంలోకి మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి ఎంపిక కాగా.. 'నాటు నాటు' గేయ రచయిత చంద్రబోస్, టెక్నిషియన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా ఈ జ్యూరీలో అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరికి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం లభించడం పట్ల వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఈ ప్యానెల్లో స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Oscar Jury Members India : ఇక నిర్మాతల కేటగిరీ నుంచి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జ్యూరీలో మెంబర్ అయ్యారు. ఆయనతో పాటు ఇంకొన్ని కేటగిరీలకు సీనియర్ దర్శకుడు మణిరత్నం, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్లకు ఆస్కార్ ప్యానెల్లో చోటు దక్కింది. వీరందరూ.. 2024లో జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ ఓటింగ్స్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా.. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుక మార్చి 10న నిర్వహించనున్నారు.
ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారని పేర్కొంది. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్ ప్యానెల్ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్కు చెందినవారే ఉండగా.. ఈ సారి ఈ ప్యానల్లో ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం.
ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయానికి వస్తే.. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇందులోని 'నాటు నాటు' సాంగ్‌కు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు.