95వ ఆస్కార్ అవార్డుల పండుగ రానే వచ్చింది. ఈ క్రమంలో ఆ అవార్డును ముద్దాడేందుకు సిద్ధమైన పలు క్యాటగిరీల నామినేషన్ల లిస్ట్‌ను మంగళవారం ఆస్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ క్యాటగిరిలో నామినేట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ పాటకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి క్రేజ్ ఉంది.
సిల్వర్ స్క్రీన్‌పై 'నాటు'(మాస్) పాటలకు ఉండే క్రేజే వేరబ్బా. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్లను తెగ ఉర్రూతలూగిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పాటలకు చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాంటి కోవలోకే చెందినదే 'ఆర్ఆర్ఆర్ నాటు నాటు' సాంగ్ కూడా.
"పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు... పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... కిర్రు సెప్పులేసుకూని కర్రసాము సేసినట్టు... మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు... ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు... నా పాట సూడూ.. నా పాట సూడూ" అంటూ ఈ సాంగ్‌తో వీర నాటు, ఊర నాటు స్టెప్పు లేస్తూ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని తెగ ఊర్రూతలూగించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. విదేశీయలు చేత కూడా ఈ పాటకు స్టెప్పులేయించేలా చేశారు.
అసలు ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వందల సంఖ్యలో స్పూఫ్‌లు, రీమిక్స్‌లు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా యువత కవర్ సాంగ్స్‌తో, ఎడిటర్స్.. తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ఈ 'నాటు'ను రీక్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టించారు. అయితే ఇప్పుడా సాంగ్ మళ్లీ ఫుల్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఎందుకంటే తాజాగా ఈ పాట.. బెస్ట్ సాంగ్ క్యాటగిరీలో గోల్డన్ గ్లోబ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ నామినేషన్స్ రేసులోకి సైతం దూసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ విశేషాలు సహా.. దీని గురించి వివిధ సందర్భాల్లో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఏం మాట్లాడారో ఓ సారి నెమరు వేసుకుందాం..
100 సిగ్నేచర్ స్టెప్పులు.. గతంలో ఓ కార్యక్రమం కోసం దర్శకుడు రాజమౌళి అమెరికాకి వెళ్లినప్పుడు అక్కడ ఈ పాట గురించి ప్రస్తావించారు. "నా స్నేహితులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ పాట కోసం నేను ఒక సీన్‌ను క్రియేట్ చేసి స్టోరీలో భాగంగా ఆ పాట వచ్చేలా చూశా. ఇక 'నాటు నాటు' సాంగ్‌కు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. అతనికి డ్యాన్స్ అంటే ప్రాణం. 3 నిమిషాలకు పైన ఉన్న 'నాటు నాటు' సాంగ్ కోసం అతడు 100 సిగ్నేచర్ స్టెపులు వేయించారు. ఆ పాటకు డ్యాన్స్ వేసేటప్పటికి డ్యాన్సర్స్ అందరికీ కాళ్ల నొప్పులు వచ్చాయి" అని చెప్పారు. రాజమౌళి ఆ పాట గురించి చెప్పగానే ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.