Ram charan G20 Summit : 'ఆర్‌ఆర్‌ఆర్'తో సినిమాతో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా ఫ్యాన్స్ తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న ఆయన.. శ్రీ నగర్లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా పరిశ్రమకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఇక ఆ సదస్సులో రామ్ చరణ్ స్పీచ్‌కు అభిమానులే కాదు భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ram Charan Hollywood Debut : ''ఇండియాలో ఎంతో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. కశ్మీర్ లాంటి ప్లేస్‌లో ఈ సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో కేరళ, కశ్మీర్.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలాంటి లోకేషన్లు షూటింగ్‌లకు ఎంతో బాగుంటాయి. నేను వీటన్నింటినీ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అందుకే నేను ఇకపై నటించనున్న సినిమాల షూటింగ్ ఎక్కువ శాతం ఇండియాలోనే జరపాలని కోరుకుంటున్నాను. కేవలం లోకేషన్ల కోసం ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటున్నాను. నేను హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆ దర్శకులకు కూడా ఇండియా అందాలు చూపిస్తాను. వాళ్లనే ఇక్కడికి రమ్మని షరతు పెడతాను. నార్త్, సౌత్ అని రెండు రకాల సినిమాలు లేవు. ఉన్నది భారతీయ సినిమా ఒక్కటే. ఇప్పుడు అదే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది'' అని అన్నారు.