ఆస్కార్ అవార్డు సాధించిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రధాని మోదీతో శుక్రవారం వేదికను పంచుకోనున్నారు. ఇండియా టుడే ఛానల్ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్‌చరణ్ పాల్గొననున్నారు. అనంతరం మోదీతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ ఈ కార్యక్రమం కోసం శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. అనంతరం అక్కడున్న విలేకరులతో చరణ్ మాట్లాడారు.
"నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. కీరవాణి,రాజమౌళి, చంద్రబోస్‌లను చూసి మేము గర్విస్తున్నాము. వారి కృషి వల్లనే మేము రెడ్ కార్పెట్‌పై వెళ్లి భారత్‌కు ఆస్కార్ తీసుకురాగలిగాము. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూసి "నాటు నాటు" పాటను సూపర్‌హిట్ చేసినందుకు భారతీయ అభిమానులందరికీ నా ధన్యవాదాలు. 'నాటు నాటు' అనేది మా పాట కాదు అది భారతదేశంలోని ప్రజల పాట. అది మాకు ఆస్కార్ అవార్డును అందుకునేందుకు ఒక మార్గాన్ని ఇచ్చింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే చరణ్‌ను ప్రధాని మోదీ సత్కరించనున్నారని సమాచారం. ఇదే వేదికపై రామ్‌చరణ్ ప్రసంగం కూడా ఉంటుందని తెలిసింది. ఆ కార్యక్రమంలో మోదీ, చరణ్, సచిన్‌తో పాటు హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, పి చిదంబరం, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, పారిశ్రామికవేత్తలు అనిల్ అగర్వాల్, సంజీవ్ గోయెంకా, పారిశ్రామికవేత్త, బైజూ రవీంద్ర వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. జన్యు శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్‌తో పాటు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ యూయూ లలిత్ తదితరులు పాల్గొననున్నారు. ఆస్కార్ గెలిచిన తర్వాత రామ్ చరణ్ దిల్లీలో తొలిసారి పర్యటిస్తున్నందున అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఫ్యాన్స్ భారీ ఎత్తున నినాదాలు చేశారు.