'బడబాగ్నికి, జడివానకు దోస్తీ.. విధిరాతకు, ఎదురీతకు దోస్తీ.. పెనుజ్వాలకు, హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ'.. వెండి తెరపై ఈ 'దోస్తీ' పాట చూసి చెర్రీ, తారక్ అభిమానాల ఖుషీ మాటల్లో చెప్పలేనిది. నాటు నాటు పాటకు కూడా ఇదే రెస్పాన్స్. సీతారామరాజు, భీమ్ పాత్రల స్నేహాన్ని రక్తి కట్టించేలా కృషి చేసిన రాజమౌళి డైరెక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు.. కథలో కీలకమైన అంశాల్లో ఒకటైన ఈ స్నేహాన్ని అద్భుతంగా చూపించారు జక్కన్న. అందుకే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఆ ఒక్క చోట తప్ప. అదేనండి.. పశ్చిమ దేశాల్లో. అక్కడ ప్రేక్షకులకు కూడా మన భారతీయ సినిమా నచ్చింది. బాగుంది అంటూ ప్రశంసించారు.. కానీ వాళ్లకు విషయం ఇంకోలా అర్థమైంది.
'నువ్వు ఓం శాంతి ఓం సినిమాలో దీపికను చూస్తావ్. కానీ వాడు షారుక్‌ను చూస్తాడు...' మిరపకాయ్ సినిమా గుర్తుందా?.. అందులో ఓ సన్నివేశంలో రవితేజ.. అలీకి బ్రహ్మజీ గురించి సరదాగా చెప్పే సీన్ ఇది. ప్రస్తుతం కొందరు పాశ్చాత్య ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తే వాళ్ల టేస్ట్ కూడా ఇంచుమించు ఇలానే ఉందేమో అనిపిస్తోంది. రామరాజు-భీమ్ ఫ్రెండ్షిప్ చూసి మనలో చాలా మందికి కళ్లలో నీళ్లు తిరిగితే.. వాళ్లు మాత్రం కనుబొమ్మలు ఎగరేశారు. 'ఇందులో బాగా గే ఎలిమెంట్స్ ఉన్నట్టు లేదూ..' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో తారక్, చెర్రీ కలిసి తిరగడం.. ఒకరినొకరు అన్నదమ్ముల్లా పలకరించుకోవడం.. ఇవన్నీ వాళ్లకు గే సన్నివేశాల్లా అనిపించాయి అంట. ఇది ఏ స్థాయిలో ఉందంటే ఓ యూజర్.. ఇంటర్వెల్ సీన్లో ఇద్దరి మధ్య ఉన్న భారీ ఫైట్ సీన్లోని ఓ స్క్రీన్‌షాట్ తీసి.. ''ఆర్ఆర్ఆర్'ను ఓ పీరియడ్ గే లవ్ స్టోరీగా చూస్తే చాలా క్యూట్‌గా ఉంటుంది' అని కామెంట్ పెట్టింది. మరో యూజర్ అయితే.. 'యాక్షన్, అడ్వెంచర్, రివెంజ్ అని అన్నీ కోణాలు ఉన్నాయి కానీ ఇది ఓ చక్కని గే లవ్ స్టోరీ అని నాకు ఎవరూ ఎందుకు చెప్పలేదు' అని ట్వీట్ చేశాడు.