ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌తో పాటు బుల్లితెరపై పలు షోస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న లేడీ ఆర్టిస్ట్ రౌడీ రోహిణి.. ఇటీవలే తన కాలులో ఉన్న రాడ్‌ను తీయించుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయిందని, ఇంతకాలం కెరీర్ లో బిజీగా ఉండడంతో రాడ్డును తీయించేందుకు టైం దొరకలేదని ఇటీవలే ఆమె యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. అయితే ప్రమాదం జరిగి దాదాపు ఆరున్నర సంవత్సరాలు కావడంతో రాడ్డు కాలు ఎముకలోకి చొచ్చుకుపోయిందని, తీయటం కష్టమని కూడా వైద్యులు చెప్పినట్టు రోహిణి వీడియోలో వెల్లడించింది. తాజాగా ఆ రాడ్డును డాక్టర్లు తీసివేసినట్టు ఆమె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని హాస్పిటల్లో రాడ్డు తీయడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో రోహిణి తన తల్లిదండ్రులతో కలిసి విజయవాడలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్టు ఆమె తెలిపింది. అప్పట్లో యాక్సిడెంట్ అయిన సమయంలో తాను అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నానని, తన పరిస్థితి చెప్పడంతో తనకు చికిత్స చేసిన శ్రీధర్ అనే డాక్టర్ చెప్పినట్టు ఆమె చెప్పింది. దాంతో పాటు ఆమె కాలులో రాడ్డును తొలగించిన విధానాన్ని కూడా రోహిణి వివరించింది.
తనకు గంటలో సర్జరీ చేస్తామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని రోహిణి చెప్పింది. కానీ ఆ రాడ్డు బయటికి తీయడానికి 10 గంటలు పట్టిందని తెలిపింది. రాడ్డు సగానికి వచ్చి మధ్యలో ఆగిపోయిందని, కానీ డాక్టర్లు ఎలాగోలా కష్టపడి దాన్ని బయటకు తీశారని చెప్పింది. ఆరు వారాల దాకా కాలు కింద పెట్టకూడదని, కాలుపై ఎలాంటి బరువులు వేయకూడదని డాక్టర్లు సూచించినట్టు రోహిణి వీడియోలో చెప్పుకొచ్చింది. చాలా కుట్లు వేశారన్న ఆమె.. కాలుకు డ్రెస్సింగ్ చేసే సన్నివేశాలను, కుట్లు పడిన ప్రాంతాలను కూడా వీడియోలో చూపించింది. అంతే కాకుండా ఆమె చేతికి ఎక్కడ పడితే అక్కడ ఇంజక్షన్ల కోసం సూదులు గుచ్చారని ఏడుస్తూ తెలిపింది. ఈ సమయంలో ఆమె పక్కనే ఉండి, అన్నీ చూసుకుంటున్న రోహిణి తల్లి కూడా ఆమెకు ధైర్యం చెప్తూ మాట్లాడింది. రోహిణి రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ వీడియోపై ఆమె అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉండే ఆమె.. ఇలా బెడ్‌పై ఉండడం చూసి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
అంతకు ముందు ఇదే విషయంపై యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేసిన రోహిణి.. ఈ సమయంలో కాలులో రాడ్డు తీయించుకుందామని అనవసరంగా వచ్చానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రాడ్డును తీయలేమని డాక్టర్లు చెబుతున్నారని, ఒకవేళ తీస్తే ఎముక మల్టిఫుల్ ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించినట్టు వెల్లడించింది.