Round Up 2023 Tollywood Box Office :ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను అందించిన 2023 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. 2024కు స్వాగతం పలికేందుకు మరో ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బాక్సాఫీస్ పద్దును సరిచూసుకునేందుకు సీని పరిశ్రమ సిద్ధమైంది. అయితే ఈ లెక్కల్లో మొదటి పేజీ అగ్ర తారలదే. సంక్రాంతి మొదలు ఏడాది చివరి వరకు అగ్ర హీరోల సినిమాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని చిత్రాలు భారీ విజయం అందుకోగా మరికొన్ని బాక్సాఫీసు ముందు నిరాశపరిచాయి. మరి ఈ ఏడాది ఎవరికి తీపి గుర్తుగా మిగిలింది, ఎవరికి చేదు అనుభవాన్ని అందించింది? అనే విషయాలు తెలుసుకుందాం.
గర్జించిన నటసింహ!
బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టాలన్నా, థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించాలన్నా అది అగ్రతారలకే సాధ్యం. ఇక ప్రతి ఏడాది వస్తున్న ఆనవాయితీని ప్రకారం ఈసారి కూడా సంక్రాంతి నుంచే బాక్సాఫీసు ముందు అగ్ర తారల ఆధిపత్యం మొదలైంది. ఈ ఏడాది పండగ బరిలో మొదటి నందమూరి బాలకృష్ణ పోరు ఆరంభించారు. 'వీరసింహారెడ్డి' సినిమాతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చారు. మాస్ యాక్షన్ తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌కు నూతనోత్తేజాన్ని అందించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో దసరా సందర్భంగా 'భగవంత్ కేసరి'గా వచ్చి మరో విజయం అందుకున్నారు.
మెగాస్టార్‌కు మిశ్రమ ఫలితం!
టాలీవుడ్ మరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి 2023 మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. గతేడాది లాగే ఈసారి కూడా రెండు చిత్రాలతో ఆయ అభిమానులను పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'వాల్తేరు వీరయ్య' విజయం సాధించింది. కానీ ద్వితీయార్ధంలో వచ్చిన 'భోళా శంకర్' సినిమా చేదు ఫలితాన్ని అందించింది. దీంతో విజయమే లక్ష్యంగా ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'మెగా 156' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని వశిష్ఠ రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే 2024 విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ లైనప్
మరో అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాదంతా వరుస సినిమాలతోనూ సెట్స్‌పై తీరిక లేకుండా గడిపారు. కానీ, వాటిలో నుంచి ఒక్క 'బ్రో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కాలస్వరూపుడిగా పవన్ కల్యాణ్ చేసిన సందడి చేశారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం పవన్ 'ఓజి', 'ఉస్తాద్ భగత్‌సింగ్', 'హరి హర వీరమల్లు' చిత్రాలు రావాల్సి ఉంది.