ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్ తెరకెక్కించిన చిత్రం 'రాకెట్రీ'. మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ, సైన్స్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మాధవన్ చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. సైన్స్ తెలియకపోతే మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండు.. అంటూ వారు ఏకేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
'రాకెట్రీ' ప్రమోషన్స్‌లో భాగంగా మాధవన్, ఆయన టీమ్ వివిధ ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందని మాధవన్ అన్నారు. ఇస్రో వాళ్లు పంచాగం చూసి పెట్టిన ముహూర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించిందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.