సినీఇండస్ట్రీలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లిని చంపి ఓ యువ నటుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని కోర్టులో హాజరుపరచగా.. అతడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 14ఏళ్ల పాటు పెరోల్ మీద కూడా బయటకు వచ్చేందుకు వీలులేకుండా చేసింది. ఎక్కడంటే..
ఇదీ జరిగింది.. పలు హిట్ సినిమాలు, టీవీషోస్తో గుర్తింపు పొందాడు హాలీవుడ్ నటుడు రియాన్ గ్రాంథమ్. అతడు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం.. వాంకోవర్ నగరానికి చెందినవాడు. అయితే అతడు 2020 మార్చి 31 తన తల్లిని అతి దారుణంగా చంపాడు. తుపాకీతో ఏకంగా తల వెనక భాగంలో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతడు పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి అతడు జైలులోనే ఉన్నాడు. ఆ కేసుపై విచారణ చేపట్టిన అక్కడి న్యాయస్థానం అతడికి పెరోల్ మీద బయటకు రాకుండా ఉండేలా జీవితఖైదును విధించింది. ఈ విషయం ఇంగ్లీష్ మీడియా ద్వారా తెలిసింది. కానీ అతడు తన తల్లిని ఎందుకు చంపాడో చెప్పలేదు.