Recording a Film in Theaters is Punishable Offense:ఫేవరేట్ హీరో సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. సినిమా రిలీజ్‌కు ముందే థియేటర్ల దగ్గర హడావుడి ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ అయిన రోజే చాలా మంది బెనిఫిట్ షో లకు వెళ్లి రచ్చ రచ్చ చేస్తారు. అయితే.. థియేటర్‌కు వెళ్లిన వారిలో కొద్దిమంది అభిమానులు.. సినిమాను తమ ఫోన్లలో వీడియో తీస్తుంటారు. అలా షూట్ చేసిన వీడియోను.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్‌కు షేర్ చేస్తుంటారు. లేకపోతే.. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో పోస్ట్ కూడా చేస్తుంటారు. ఇలా వీడియోలు తీసే వారికి హెచ్చరిక. ఇక పై ఇలా చేస్తే చిక్కుల్లో పడ్డట్టే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం యమా సీరియస్‌గా ఉంది.
సినిమా పరిశ్రమ ఎదుర్కొంటోన్నప్రధాన సమస్యల్లో పైరసీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. కోట్లాది రూపాయల ఖర్చుతో.. నెలలు, సంవత్సరాల తరబడి చిత్రీకరించిన సినిమాలను.. విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసేస్తున్నారు. థియేటర్లోనే దర్జాగా వీడియోలు తీసి.. ఆన్లైన్లో పోస్టు చేస్తున్నారు. ఈ పైరసీకి అడ్డుకట్టవేయడానికి సినిమా ఇండస్ట్రీతోపాటు ప్రభుత్వాలు చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా.. ఈ పైరసీ భూతాన్ని ఆపలేకపోయాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లులో పైరసీని అడ్డుకోవడంతోపాటు ఓటీటీలలో అశ్లీల కంటెంట్‌ను నిరోధించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
సినిమా పైరసీ చేసే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు.. మూవీ నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించే విధంగా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023(Cinematography Amendment Bill 2023)ను ఆగష్టు 23వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. అంతకుముందే రాజ్యసభ దీనిని ఆమోదించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత చట్టంగా మారనుంది. పైరసీ కారణంగా దేశంలోని సినిమా పరిశ్రమ ప్రతి సంవత్సరం దాదాపు 20వేల కోట్ల రూపాయల మేర నష్టపోతోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్(Central Minister Anurag Thakur) వెల్లడించారు. బిల్లు ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడారు. పైరసీ అనేది క్యాన్సర్ లాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బిల్లు తెచ్చామని స్పష్టం చేశారు. పైరసీని అరికట్టేందుకు కఠినమైన కొత్త సెక్షన్లను ఈ బిల్లులో జోడించామని తెలిపారు.
ప్రస్తుతం భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారని, ఇక నుంచి వయసులవారీగా సినిమా, టీవీ కంటెంట్‌ను వర్గీకరిస్తున్నామని తెలిపారు. యూఏ కేటగిరీ(UA Category)లో యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ గా విభజిస్తూ సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. టీవీలో సినిమా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వనున్నామని చెప్పారు. పాత చట్టం ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ 10 సంవత్సరాల వరకే చెల్లుబాటు అయ్యేదని, కొత్త బిల్లు చట్టంగా మారాక సెన్సార్ సర్టిఫికెట్ శాశ్వతంగా చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. A సర్టిఫికెట్ పొందిన సినిమాలో మార్పులు చేస్తే U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి కొత్త బిల్లులో అవకాశం ఉందని తెలిపారు.
చూశారుగా.. కొత్త నిబంధనల ప్రకారం పైరసీ చేస్తే.. కఠిన చర్యలు తప్పవు. అయితే.. తాము తీసేది ఒక చిన్న బిట్టు మాత్రమే కదా అని అభిమానులు అనుకుంటే కుదరదు. చట్టం ప్రకారం.. ఎంత మొత్తం వీడియో తీసినా కూడా.. అది పైరసీ కిందకే వస్తుంది. కాబట్టి.. సినీ అభిమానులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటేనే మంచిది.