Bollywood Failures 2022 కోరనా ముందు వరకూ జోష్ మీదున్న బాలీవుడ్.. ఇప్పుడు ఆన్లైన్ వేదికలు పుంజుకోవడంతో కష్టాలను ఎదుర్కొంటోందని ఎస్బీఐ రీసెర్చి నివేదిక అభిప్రాయపడింది. ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం బాలీవుడ్ పరిస్థితికి కారణాలు తెలుసుకొని కొన్ని సూచనలు చేసేలా ఓ పరిశోధన నిర్వహించింది. "శుక్రవారం బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రిలీజు రోజులను గుర్తు చేస్తూ: సరికొత్త భారత్‌లోని వీక్షకుల మనస్తత్వాల్లోని మార్పులను మనం చూస్తున్నామా?" అనే శీర్షికన ఈ పరిశోధనను విడుదల చేసింది. దీనిలో హిందీ సినిమాను దెబ్బతీస్తోన్న చాలా అంశాలను ప్రస్తావించింది.
ఆ మూవీస్ నుంచి భారీ కలెక్షన్లు..కొవిడ్ తర్వాత విడుదలైన హిందీ సినిమాల కంటెంట్ రెండు వైపులా పదునున్న కత్తి మాదిరిగా ఉంటోందని అభిప్రాయపడింది. ఇది ఆదాయాలపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది. సినీ పరిశ్రమకు రెండు ప్రపంచ యుద్ధాలు కూడా చేయలేని నష్టాన్ని కొవిడ్ చేసిందని అభివర్ణించింది. కొవిడ్‌కు ముందు బాలీవుడ్లో ఏటా సగటున 70-80 చిత్రాలు విడుదలకాగా.. రూ.3,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్ల వరకు వసూళ్లు లభించేవి.
కొవిడ్ తర్వాత 2021జనవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కేవలం 61 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. వీటిల్లో కొన్ని మాత్రమే హిందీలో తీసినవి కాగా.. మిగిలినవి దక్షిణ భారత, ఇంగ్లిష్ భాషల నుంచి డబ్బింగ్ చేసినవి. మొత్తం చిత్రాలు కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. వీటిల్లో కూడా 48 శాతం వసూళ్లు 18 డబ్బింగ్ చిత్రాల నుంచే లభించాయి. వాస్తవంగా హిందీ చలనచిత్ర పరిశ్రమ తీరు అసంతృప్తికరంగా ఉందని ఎస్బీఐ పేర్కొంది.
రేటింగ్ల్లోనూ నిరాశే..సినిమాల విజయాలను విశ్లేషించడంలో రేటింగ్స్ చాలా కీలకమైనవి. విజయవంతమైన సినిమాలకు సాధారణంగా మంచి రేటింగ్ లభిస్తుంది. వాస్తవానికి ఐఎండీబీ రేటింగ్‌ల వల్ల రూ.17 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్లు లభిస్తున్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 జనవరి నుంచి ఆగస్టు వరకు విడుదలైన 43 హిందీ సినిమాల సగటు రేటింగ్ 5.3. ఇది 18 హిందీ డబ్బింగ్ సినిమాలకు లభించిన సగటు రేటింగ్ 7.3కంటే తక్కువే.
సింగిల్ స్క్రీన్లు తగ్గడమూ సమస్యే.. ప్రస్తుతం థియేటర్లలో సౌకర్యాలు పెరుగుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు తగ్గుతూ మల్టీప్లెక్సులు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా హిందీ పరిశ్రమపై మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది. సింగిల్ స్క్రీన్లతో పోలిస్తే ఈ మల్టీప్లెక్సుల్లో టికెట్ల ఖరీదు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా ఉంటుంది. ముఖ్యంగా వినోద పన్ను ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. దక్షిణాదిన 62శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లే ఉన్నాయి.. అదే ఉత్తర భారత్‌లో కేవలం 16శాతం, పశ్చిమ భారత్‌లో 10శాతం మాత్రమే ఉన్నాయి. అందుకే దక్షిణ భారత సినిమాలు అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.