తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇకపై ఎలాంటి పాత్రైనా చేస్తా.. అందుకే రవితేజ సినిమా ఒప్పుకున్నా'

Ramarao on Duty Venu thottempudi: దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత 'రామారావు ఆన్‌ డ్యూటీ'తో తెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి. దీన్ని శరత్‌ మండవ తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు పంచుకున్నారు వేణు. ఆ సంగతులివీ...

Ramarao on Duty Venu thottempudi
రామారావు ఆన్​ డ్యూటీ వేణు తొట్టెంపూడి

By

Published : Jul 29, 2022, 7:06 AM IST

Ramarao on Duty Venu thottempudi: 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్‌ జంక్షన్‌', 'పెళ్లాం ఊరెళితే' వంటి వినోదాత్మక చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు నటుడు వేణు తొట్టెంపూడి. 'దమ్ము' తర్వాత సినిమాలకు దూరం జరిగిన ఆయన.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత 'రామారావు ఆన్‌ డ్యూటీ'తో తెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శరత్‌ మండవ తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు పంచుకున్నారు వేణు.

సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకోవడానికి కారణమేంటి?
మా కుటుంబానికి చాలా వ్యాపారాలున్నాయి. అందులో కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ కూడా ఒకటి. ఒకానొక సమయంలో వీటన్నింటిపైనా దృష్టి పెట్టాల్సి వచ్చింది. సినిమాలకు దూరంగా ఉండటానికి ఇంతకు మించి ప్రత్యేక కారణాలేమీ లేవు. ఈ విరామంలో చాలా మంది కథలు వినిపించే ప్రయత్నం చేశారు. ఎందుకో ఆ సమయంలో నాకు కూడా మళ్లీ సినిమాలపై ఆలోచన రాలేదు. నాకు మొదటి నుంచీ మల్టీస్టారర్‌ సినిమాలు చేయడమంటే ఇష్టం. 'చిరునవ్వుతో' సినిమాతో సోలోగా విజయాన్ని అందుకున్నా.. వెంటనే 'హనుమాన్‌ జంక్షన్‌' లాంటి మల్టీస్టారర్‌ చేయడానికి కారణమిదే. ఇలాంటి మల్టీస్టారర్లు చేయడం ద్వారా అనుభవజ్ఞులైన హీరోలతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది.. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆశ. అందుకే ఆ తర్వాత కూడా 'ఖుషీ ఖుషీగా', 'పెళ్లాం ఊరెళితే', 'శ్రీకృష్ణ 2006' వంటి చిత్రాలు చేశా.

మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
ఈ విషయంలో కరోనాకి థ్యాంక్స్‌ చెప్పాలి. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో కూర్చొని టీవీ, సినిమాలు చూసే తీరిక దొరికింది. ఓటీటీలో 'పాతాల్‌ లోక్‌', 'ఫ్యామిలీమెన్‌', 'మీర్జాపూర్‌', 'మనీ హీస్ట్‌' వంటి వెబ్‌సిరీస్‌లు చూశా. చాలా నచ్చాయి. అయితే అవన్నీ చూశాక.. నేను యాక్టింగ్‌ చేయట్లేదు కదా అని లోలోపల ఓ చిన్న బాధ మొదలైంది. అప్పుడే మళ్లీ నటన వైపు దృష్టి మళ్లింది. అదే సమయంలో చాయ్‌ బిస్కెట్‌ వాళ్లు ఓ మంచి కథతో నా దగ్గరకొచ్చారు. అది మొదలుపెట్టిన కొన్నాళ్లకే 'రామారావు ఆన్‌ డ్యూటీ' దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించారు.

ఈ కథ ఒప్పుకోవడానికి.. దీంట్లో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?
పెద్ద సినిమాతో రీఎంట్రీ ఇస్తే.. చాలా మందికి చేరువవుతాను. ఆ నమ్మకంతోనే ఈ చిత్రం ఒప్పుకున్నా. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తా. గతంలో నేనెప్పుడూ ఈ తరహా పాత్ర చేయలేదు. గతంలో నేను ఏ చిత్రానికీ డబ్బింగ్‌ చెప్పలేదు. కానీ, తొలిసారి ఈ సినిమాకి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా.

మీరు గతంలో 'దమ్ము' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. ఆ చిత్రం ఎందుకు చేశానని ఎప్పుడైనా అనిపించిందా?

అలా ఎప్పుడూ అనిపించలేదు. ఇదొక ప్రయాణం. ఆ దారిలో నాకొచ్చిన పాత్రల్ని గౌరవించుకుంటూనే వెళ్లా. ఓ తప్పు చేస్తే.. అక్కడితో ప్రయాణం ఆగిపోయినట్టు, దారులన్నీ మూసుకుపోయినట్టు కాదు కదా. వాస్తవానికి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు కథ మొత్తం చెప్పరు. కాబట్టి సినిమా ఎలా ఉంటుందన్న అవగాహన ఉండదు. మన పాత్ర గురించి చెప్పిన దాన్ని బట్టి.. ఇలా ఉంటుందేమోనని ఊహించుకుంటాం అంతే. 'దమ్ము' చేసేటప్పుడు నా పాత్ర 'షోలే'లో అమితాబ్‌ పాత్రలా ఉంటుందన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు. 'షోలే'లో అమితాబ్‌ చనిపోయినట్టు.. 'దమ్ము'లో నేను చనిపోతాను. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలిక అదొక్కటే (నవ్వుతూ).

ఇకపై ఎలాంటి పాత్రలతో అలరించాలనుకుంటున్నారు?
మంచి కథలొస్తే.. ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. ప్రస్తుతం నా దృష్టి ఎక్కువగా వెబ్‌ కంటెంట్‌పై ఉంది. ఇండస్ట్రీ మనిషిగా ఇలా చెప్పకూడదు కానీ.. ఓటీటీలు వచ్చాక వినోదం చాలా దగ్గరైంది. మనకు ఎప్పుడు టైమ్‌ దొరికితే అప్పుడు హాయిగా చూసుకునే వీలుంటుంది. ఎలాంటి టెన్షన్‌ ఉండదు. అందుకే వెబ్‌ వైపు మొగ్గుచూపుతా. ప్రస్తుతం రెండు ఓటీటీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పా.

ఇదీ చూడండి:బాలకృష్ణకు సోనాక్షి గ్రీన్​సిగ్నల్​ ఇస్తుందా?

ABOUT THE AUTHOR

...view details