Raveena Tandon Pawankalyan: 'కేజీఎఫ్ 2' సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటించిన ప్రధానమంత్రి పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు రవీనాకు మరో సూపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. కథ, పాత్ర నచ్చి రవీనా కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగులో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఇదే అవుతుంది. కాగా, ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించనుంది.
Prabhas Salar movie: 'కేజీఎఫ్'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్ 2'తోనూ మరోసారి తన సత్తా చాటాడు. కథా నేపథ్యం, యశ్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. దీంతో అందరీ దృష్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్ 'సలార్'పైన పడింది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఓ భయంకరమైన లోయలో ఛేజింగ్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ప్రీ క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ సీన్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఈ ఒక్క సన్నివేశం కోసం దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.