హీరో నితిన్- హీరోయిన్ రష్మికా మందన్న-దర్శకుడు వెంకీ కుడుముల అనగానే గుర్తొచ్చేది 'భీష్మ' సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల.. కలిసి మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఉగాది సందర్భంగా తమ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అదీ కూడా డిఫరెంట్ స్టైల్లో. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెటైర్లు వేసుకుంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
'భీష్మ' కన్నా ముందు 'ఛలో' సినిమాకు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా ఇది. రష్మికకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఈ చిత్రం హిట్ అయింది. ఆ తర్వాత వెంకీ కుడుముల తీసిన భీష్మ కూడా సక్సెస్ సాధించింది. ఇందులో కూడా రష్మికనే హీరోయిన్. దీంతో తాజా వీడియోలో.. నితిన్ మాట్లాడుతూ.. వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కన్నా ముందు, ఓం కాకుండా రష్మిక పేరే రాసుకుంటాడని అని సరాదాగా కామెంట్ చేశారు.
నితిన్ ఓ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. 'ప్రభా.. ఎవరూ ఇంకా రాలేదా?' అని అడగగా.. 'హీరోయిన్ ఉదయం 8 గంటలకే వచ్చారు' అని సమాధానం వినిపిస్తుంది. 'ఎనిమిది గంటలకా.. సేమ్ హీరోయినా?' అంటూ నితిన్ మళ్లీ అనగా.. ఇంతలో రష్మిక ఎంట్రీ ఇస్తుంది. ' హా సేమ్ హీరోయినే.. డౌటా?' అని రిప్లై ఇస్తుంది. 'అస్సలు డౌట్ లేదమ్మా... మన డైరెక్టర్ స్క్రిప్ట్‌లో ఓం కన్నా ముందు నీ పేరే రాస్తాడుగా. నాకు తెలుసు' అని నితిన్ సరదాగా అంటారు.