Ranbir kapoor Movie Break : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'యానిమల్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు మూవీటీమ్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ స్టార్ హీరో యానిమల్' తర్వాత మరే సినిమాలను ఓకే చేయలేదంట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనికి గల కారణాన్ని తెలిపారు రణ్‌బీర్ కపూర్. ఈ సినిమా అనంతరం ఆరు నెలల పాటు విరామం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ సమయాన్ని తన కూతురితో కలిసి సమయాన్ని గడపడానికే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.
"కొన్ని నెలల పాటు మా కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నా. నా సినిమా షెడ్యూల్ కారణంగా తను పుట్టాక ఎక్కువ సమయం పాపతో గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు రాహాతో ఉండాలనుకుంటున్నా. అందుకే యానిమల్ తర్వాత మరే సినిమాను అంగీకరించలేదు. రాహా ఇప్పుడే అన్నింటినీ గుర్తిస్తోంది. ప్రేమను వ్యక్తపరుస్తోంది. మాట్లడటానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి అందమైన క్షణాలను నేను ఆస్వాదించాలనుకుంటున్నాను." అని రణ్‌బీర్ కపూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ - రణ్‌బీర్ కపూర్ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2022 నవంబర్ 6న ఆడబిడ్డ జన్మించింది.