Ranbir Kapoor Indian Idol :బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా చేసిన ఓ పని అభిమానుల మనసులను హత్తుకుంది. యానిమల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ప్రముఖ సింగింగ్ ప్రోగ్రాంకు వెళ్లిన ఆయన.. అక్కడున్న ఓ కంటెస్టెంట్ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదించమని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. రణ్‌బీర్ సింప్లిసిటీని కొనియాడుతున్నారు. 'హార్ట్ టచింగ్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
మ్యూజిక్ లవర్స్ అభిమానించే 'ఇండియన్ ఐడల్' హిందీ షో కు తాజాగా 'యానిమల్' టీమ్ వెళ్లింది. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం నుంచి రణ్‌బీర్ కపూర్, రష్మిక హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే ఆడుతూ పాడుతూ సందడి చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జడ్జీల పక్కన కూర్చుని కంటెస్టెంట్ల పాటలను విన్నారు. అందులో మేనక పౌదుల్ అనే ఓ దివ్యాంగ కంటెస్టెంట్ 'అగర్ తుమ్ సాత్ హో' అనే రణ్‌బీర్ పాటను ఆలపించారు. ఆమె పాడిన తీరుకు మంత్రముగ్దుడైన రణ్‌బీర్.. పాట పూర్తికాగానే రష్మికతో కలిసి స్టేజ్ మీదకు వెళ్లారు. వెంటనే మేనక పాదాలను తాకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.
ఆమెకు కళ్లు కనిపించని కారణంగా రణ్‌బీర్.. తనను తాను పరిచయం చేసుకున్నారు. 'మేనక.. నా పేరు రణ్‌బీర్. శ్రేయా ఘోషల్ ఈ పాట పాడినప్పుడు అందరికీ ఏ అనుభూతి కలిగిందో ఇప్పుడు మీ పాట విన్నప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. ఆవిడ ఎంతోమందికి దేవతతో సమానం. ఇప్పుడు మీరు రెండో దేవతలా కనిపిస్తున్నారు' అంటూ మేనకను కొనియాడారు. దీంతో సెట్లో ఉన్నావారంతా ఎమోషనలయ్యారు.