రానా , సాయి పల్లవి నటించిన సినిమా 'విరాటపర్వం'. నక్సలిజం నేపథ్యంలో రూపొంది, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందీ చిత్రం. వేణు ఊడుగుల దర్శకుడు. ఎస్.ఎల్.వి. సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం టికెట్ ధరల వివరాలు తెలియజేసింది.
"ఈ ఇతిహాస ప్రేమకథను అందుబాటులో ధరల్లోనే వీక్షించండి" అంటూ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరలు ఎంత ఉంటాయో సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సింగిల్ స్క్రీన్స్: తెలంగాణ- రూ.150, ఏపీ- రూ.147; మల్టీప్లెక్స్: తెలంగాణ- రూ.200, ఏపీ- రూ.177 (జీఎస్టీతో కలిపి)గా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్ ఉద్యమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాలో నందితా దాస్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, సాయిచంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
మరిన్ని విశేషాలు..
- దర్శకుడు వేణు ఊడుగుల స్వస్థలం వరంగల్. ఆయనకు సాహిత్యమంటే మక్కువ. పుస్తకాలు బాగా చదువుతుంటారు. నక్సల్స్ జీవితాలను దగ్గరగా చూశారు. సామాజిక అంశాలు, చరిత్రలో దాగిన ఎన్నో కథలను తెరపైకి తీసుకురావాలనేది ఆయన సంకల్పం. ఈ క్రమంలోనే తొలి ప్రయత్నంగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా తీశారు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. టైటిల్‌కు తగ్గట్టు అందరితోనూ ఇది నా కథే అనిపించింది. చదువు ఒక్కటే జీవితం కాదనేది ఈ సినిమా ఇతివృత్తం. అంతగా ఆకట్టుకున్న దర్శకుడు తదుపరి ఎలాంటి సినిమా తీస్తాడని అంతా ఎదురుచూశారు. ఆయన చేసిన ద్వితీయ ప్రయత్నమే ఈ ‘విరాటపర్వం’.
- తాను పుట్టిన గడ్డపై 1992లో జరిగిన ఓ హత్య వేణును కదిలించింది. ఆ మరణం వెనక రాజకీయం ఉందని తెలుసుకున్న ఆయన ఆ వాస్తవాన్ని తెరపైకి తీసుకురావాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే పక్కాగా స్క్రిప్టు రాసుకుని ఆ మర్డర్ మిస్టరీకి ఓ చక్కని ప్రేమకథను జోడించారు.
- ఆ మరణం ఎవరిదనే విషయాన్ని బయటపెట్టని ఆయన ప్రేమకథ గురించి పలు సందర్భాల్లో వివరించారు. ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అని పేర్కొన్నారు. రానా, సాయిపల్లవి మధ్య ఈ లవ్ ట్రాక్ నడుస్తుంది. నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తి స్ఫూర్తితో రానా పాత్ర, వరంగల్‌కు చెందిన సరళ అనే మహిళ స్ఫూర్తితో సాయిపల్లవి క్యారెక్టర్ రూపొందించారు.
- ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయి పల్లవి, కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటించారు. వెన్నెల అనే పాత్రలో ఒదిగిపోయేందుకు చిత్రీకరణ ప్రారంభంలో సాయిపల్లవి ఓ రోజంతా ఆహారం తీసుకోలేదట. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, నవీన్ చంద్ర, సాయి చంద్ కీలక పాత్రలు పోషించారు.
- విరాటపర్వాన్ని ఓ విధంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా పరిగణించవచ్చు. ఎందుకంటే సాయిపల్లవి పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. వెన్నెల క్యారెక్టర్‌కు అంత స్కోప్ ఉంది. ఈ సినిమాలో 8 ప్రధాన పాత్రలు ఉండగా అందులో 5 స్త్రీ పాత్రలే. అందుకే ఈ చిత్రంలో కీలక పాత్ర (కామ్రేడ్ రవన్న) పోషించేందుకు ఏ హీరో అయినా ఒప్పుకుంటారా అని దర్శకుడు ప్రారంభంలో సందేహించారట. ఇలా తర్జన భర్జనలోనే సినిమాను నిర్మిస్తారేమోనని నటుడు రానాను కలిశారు వేణు. స్క్రిప్టు తనను కూర్చోనివ్వకుండా చేయడంతో రానా వెంటనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పారట. అలా రానా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
- దర్శకుడు వేణు ఈ సినిమాకి ముందెన్నడూ సాయిపల్లవిని కలవలేదు. ‘విరాటపర్వం’ కథ వినిపించేందుకు తొలిసారి ఆమెను కలిశారు. స్టోరీ విన్న వెంటనే ఆమె ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో పలు సినిమాలు వచ్చినా, వాటిల్లో అంతగా ప్రేమకథ కనిపించదు. మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పడంతోపాటు ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడంతో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించకుంది.
- ఈ సినిమాకి ఇక్కడి ప్రముఖ సాంకేతిక నిపుణులే కాకుండా విదేశాల వారూ పనిచేశారు. దివాకర్‌మణితో కలిసి స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్ర ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. పీటర్ హెయిన్‌తో కలిసి జర్మనీకి చెందిన స్టీఫెన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, నృత్యం: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర.
- మహాభారతంలోని విరాటపర్వం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఉన్నట్టే ఈ సినిమాలోనూ కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ తదితర అంశాలు కనిపిస్తాయి. అందుకే ఈ సినిమాకి ‘విరాటపర్వం’ అనే టైటిల్ పెట్టారు.
- 2019 జూన్ 15న ‘విరాటపర్వం’ చిత్రీకరణ ప్రారంభమైంది. ముందుగా ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 30న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించినా కొవిడ్, ఇతరత్రా కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం ఈ సినిమాను పెద్ద తెరపైకే తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2022 జులై 1 విడుదలచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించినా తర్వాత తేదీని మార్చింది. విరాటపర్వాన్ని ముందుగానే మీ ముందుకు తీసుకొస్తున్నామంటూ జూన్ 17ను ఖరారు చేసింది.
- ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగు భాషలోనే అందుబాటులో ఉండనుంది. 90ల నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఈ సినిమా కోసం ‘వైడ్‌స్క్రీన్ ఫార్మాట్’ను ఉపయోగించారు.
ఇదీ చూడండి: రెండేళ్లు టార్గెట్.. 'జబర్దస్త్'లో ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న.. లైఫ్ ఛేంజ్!