Rana saipallavi virataparvam: "నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్యమైన చిత్రం. ఇలాంటి పాత్రలో నన్ను ఊహించినందుకూ, ఈ కథని రాసినందుకు వేణుకి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు కొత్త ప్రయత్నాల్ని ఆదరిస్తూనే ఉంటారు." అని అన్నారు హీరోయిన్ సాయిపల్లవి. ఆమె రానాతో కలిసి నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రచార చిత్రాల ఆవిష్కరణ అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ "విరాటపర్వం తరహా సినిమాలు తెలుగు తెరపైకి వస్తూనే ఉండాలి. 'లీడర్' నుంచి రానా ఏ సినిమానైనా సరే, చాలా చిత్తశుద్ధితో చేస్తాడు. తను ఈ చిత్రం చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. తెలుగు పరిశ్రమకి వచ్చిన నిజాయతీ గల మరో దర్శకుడు వేణు ఊడుగుల. ఇలాంటి కథని ఎంచుకోవడం, తీసిన విధానం చాలా బాగుంది. సాయిపల్లవి మొదలుకొని ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. ఈ సినిమాతో సాయి పల్లవి జాతీయ పురస్కారం గెలుస్తుంది. తను పాత్రలో అంతగా జీవించింది. సవాళ్లతోకూడిన ఇలాంటి కథని ఎంచుకుని చేసిన నిర్మాతలకి నా అభినందనలు’’ అన్నారు.
"వెంకటేష్ బాబాయ్‌కే తప్ప నాకు అభిమానులు ఉంటారని అనుకోలేదు. నేనేదో కొత్త కథలు చెప్పాలని సినిమాలు చేస్తూ వెళ్లాను. ఈ సినిమా నా చివరి ప్రయోగం. ఇకపై అభిమానుల కోసం సినిమాలు చేస్తూ ఉంటా. నిజాయతీతో వేణు ఊడుగుల తీసిన సినిమా ఇది. సాయిపల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఇలాంటి కథలు నిర్మించే నిర్మాతలు అరుదుగా ఉంటారు. సాంకేతిక నిపుణులంతా చాలా బాగా పనిచేశారు. ఇది మహిళల చిత్రం" అన్నారు రానా దగ్గుబాటి.
వేణు ఊడుగుల మాట్లాడుతూ.. "సింహాలు వాటి చరిత్రని అవి రాసుకోలేనంత వరకూ వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది. మన కథ, మన జీవితాల్ని మనం ఆవిష్కరించనంత వరకు పక్కవాడు చెప్పేదే మన సంస్కృతి, మన జీవితం అవుతుంది. నా మూలాల్లోకి వెళ్లి నేను తీసిన సినిమా 'విరాటపర్వం'. ఇందులో హింస, మావో సిద్ధాంతాల గురించి చెప్పలేదు. ప్రేమ దైవం అని, మానవ స్వేచ్ఛలో ప్రేమ ఒక భాగం అని చెప్పాం. ఈ సినిమా ఓ గొప్ప జ్ఞాపకంలా నిలుస్తుందని హామీ ఇస్తున్నా" అన్నారు.నటి ఈశ్వరి, జరీనా, స్టంట్ కొరియోగ్రాఫర్, పీటర్ హెయిన్స్, తిరుమల కిషోర్, శరత్ మండవ, రాహుల్ రామకృష్ణ, ఛాయాగ్రాహకులు డానీ, దివాకర్ మణి, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, శ్రీకాంత్, దివ్యా మాలిక, సోమన్న, వరం, నాగేంద్ర, స్వరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ వార్తలపై కరణ్ జోహార్ ఫైర్.. 'వాళ్లకు కరోనా వస్తే నన్నెందుకు నిందిస్తారు?'