Rana saipallavi Virataparvam: "ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే... కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతా" అని అంటున్నారు హీరో రానా. ఆయన నటించిన తాజా చిత్రం 'విరాటపర్వం'. సాయిపల్లవి హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరంగల్‌లో ఆత్మీయ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ "ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే... కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతా. చేసిన ప్రతీ పాత్రకి సంబంధించిన ఏదో ఒక అంశం నాలో ఉంది. రవన్న పాత్ర కూడా నాలో పెద్ద భాగమైంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు? యాక్షన్ సినిమా చేయొచ్చు కదా అని అడిగేవారు. ఓ సినిమాని అభిమానుల కోసం, ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాం. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని 'ఇది నిజమే కదా..' అని నమ్మి ఒకరు చూస్తుంటారు. వాళ్ల కోసమే ఈ సినిమా చేశా" అని అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ.. "ప్రేక్షకులు ఎదురుపడినప్పుడు 'అచ్చం మా అమ్మాయిలాగా లేదంటే మా చెల్లిలాగా ఉన్నావ'ని అంటుంటారు. అంత ప్రేమని వాళ్లకి ఎలా తిరిగిస్తాననే బాధ ఉంటుంది. ఊరి మట్టిలో నుంచి వచ్చిన ఇలాంటి కథల్లో నటిస్తే కొంచెమైనా తిరిగి ఇవ్వగలుగుతున్నాననే తృప్తి ఉంటుంది. ఇలాంటి సినిమాల్ని ఆదరించకపోతే మళ్లీ ఇలాంటి కథలు రావు" అని అన్నారు.
ఆ ఒక్కరి కోసమే 'విరాటపర్వం' చేశా: రానా
Rana saipallavi Virataparvam: 'విరాటపర్వం' సినిమాలో ఎందుకు నటించారో తెలిపారు హీరో రానా. ఈ మూవీ కథ తనలో మార్పు తెచ్చిందని చెప్పారు. ఇక సాయిపల్లవి మాట్లాడుతూ.. తనను అభిమానించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. 'విరాటపర్వం' లాంటి కథల్ని ఆదరించాలని కోరారు. ఈ హీరోహీరోయిన్ ఇంకా ఏమన్నారంటే..
వేణు ఊడుగుల మాట్లాడుతూ.. "ఒక మంచి కథని నిజాయతీగా... స్వచ్ఛంగా చెబితే కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుందని నమ్మాను. మా బృందం కూడా నన్ను నమ్మింది. అలా ఈ సినిమా రూపుదిద్దుకొని బయటికొస్తోంది. ఏ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్నిజ్వాలలై మండుతాయో, ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యాలై పుడతాయో ఆ ప్రాంతమే ఓరుగల్లు. ఈ ప్రాంతంలో 1992లో జరిగిన ఓ మరణం నన్ను కదిలించింది. ఒక మహా సంక్షోభం నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటనకి ప్రేమని జోడించి ఓ మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా. రానా ఈ సినిమా ఒప్పుకున్నారంటే అది ఆయన గొప్పతనం. అందరూ చూడాల్సిన సినిమా, ముఖ్యంగా మహిళలు చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లలోనే విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చార"న్నారు. నిర్మాత మాట్లాడుతూ.. "వేణు ఈ కథని చెప్పినప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. మనలో జరిగిన మన చుట్టూ జరిగిన కథలా అనిపించింది. అన్ని సమస్యల్నీ అధిగమించి ప్రేక్షకుల ముందుకొస్తున్నాం" అన్నారు. కార్యక్రమంలో నవీన్‌చంద్ర, సురేష్ బొబ్బిలి, వరంగల్ శ్రీను, శ్రీనివాస్, ఏసీపీ కిరణ్‌కుమార్, పూసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'నాకు అమ్మ లేదు.. అన్నీ ఇంద్రజ గారే.. నా కార్ కోసం ఆమె...'