Rana Upcoming Movies : టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటిప్రస్తుతం యూఎస్‌లో ఉన్నారు. ఇటీవలే తన స్నేహితుడు ప్రభాస్‌తో కలిసి సందడి చేసిన ఆయన.. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా తన అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా పలు ఆసక్తిర ప్రాజెక్టులను ప్రకటించారు. ఓ హీరోగా, నిర్మాతగా తన తదుపరి ప్రాజెక్టుల విషయాలను వెల్లడించారు.
'హిరణ్య కశ్యప' అనే సినిమాలో లీడ్ రోల్లో రానా నటించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందించనున్నారు. అమరచిత్ర కథలు ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు మాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన సూపర్‌హిట్ మలయాళ చిత్రం 'మిన్నల్ మురళి'ని కామిక్ రూపంలో 'టింకిల్' పేరుతో నిర్మించనున్నారు. రానాకు చెందిన స్పిరిట్ మీడియా, వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించనున్నాయి.
Rana New Movie : మరోవైపు, ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీలివ్'తో కలిసి స్పిరిట్ మీడియా సంస్థ.. 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్' అనే హిస్టారికల్ వెబ్‌సిరీస్‌ను కూడా నిర్మించనుంది. అయితే అప్పట్లో రానా హీరోగా 'హిరణ్య కశ్యప' అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గతంలోనే ప్రకటించారు. కానీ ఆయన 'శాకుంతలం'తో బిజీ కావడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆ ప్రాజెక్టును కొన్ని రోజులు పక్కకు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి, రానా ఇప్పుడు ప్రకటించిన ప్రాజెక్టు అదేనా? ఈ సినిమాను దర్శకత్వం వహించేది గుణశేఖరేనా? అన్న విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక రానా సినిమాల విషయానికి వస్తే... గతేడాది 'భీమ్లా నాయక్', 'విరాటపర్వం' చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన రానా.. ఇటీవలే నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'స్పై' సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా తన బాబాయి వెంకటేశ్‌తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. మరోవైపు దర్శకుడు తేజతో కలిసి రాక్షస రాజు అనే సినిమా చేయనున్నట్లు కూడా టాక్ నడుస్తోంది.