గత కొద్ది కాలంగా సీనియర్ నటుడు నరేశ్-నటి పవిత్ర లోకేశ్ రిలేషన్షిప్ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించారు. అయితే తాజాగా ఈ విషయమై నరేశ్ రమ్య రఘుపతి స్పందించారు. నరేశ్ తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని.. ఆ కేసు కోర్టులోనే ఉందని ఆమె చెప్పారు. వాళ్ల పెళ్లిని జరగనివ్వనని అన్నారు. నరేశ్‌ను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. ఎంతోకాలం నుంచి అతడి ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆరోపించారు.
"నరేశ్‌ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయనతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. నా కుటుంబసభ్యులందరికీ నచ్చజెప్పి వివాహం చేసుకున్నాం. అత్తమ్మ (విజయనిర్మల) నన్ను ఒక రాణిలా చూసుకునేవారు. పెళ్లి అయ్యాక.. నరేశ్ గురించి నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలు ఉన్నాయని తెలిసి బాధపడ్డా. ఈ విషయాలపైనే ఆయన నాకెన్నోసార్లు క్షమాపణలు చెప్పాడు. ఆయన మారతాడని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. సమ్మోహనం సమయంలో నరేశ్-పవిత్రకు పరిచయం ఏర్పడిందని విన్నాను. ఆ సమయంలో నరేశ్ ఓసారి ఆమెను మా ఇంటికి కూడా తీసుకువచ్చాడు. ఆమెది బెంగళూరు అని పరిచయం చేశాడు. ఆమెను ఎంతో బాగా చూసుకున్నా. సినిమా పరిశ్రమలో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్లిద్దరి మీద అనుమానం వచ్చింది. కొంతకాలానికి అది నిజమైంది. ఇటీవల వాళ్లు షేర్ చేసిన వీడియో చూసి నాకు బాధగా అనిపించింది. సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం కూడా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్లిద్దరూ ఇలాంటి పనులు ఎన్నో చేశారు. వీళ్లు చేసే పనుల వల్ల నా పదేళ్ల కొడుకు కుంగుబాటుకు గురి అవుతున్నాడు. వాడికి మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేదు. 'నాన్నకు విడాకులు ఇవ్వొద్దు' అని ఓసారి వాడు నా నుంచి మాట తీసుకున్నాడు. మేమిద్దరం కలిసే ఉంటామని వాడికి మాటిచ్చా. ఎంతకష్టమైనా నేను పోరాటం చేస్తా. నరేశ్‌తో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తా. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. నేను అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను" అని రమ్య స్పష్టం చేశారు.