ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ - 'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన నటిస్తోంది. రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ రవితేజ ధమాకా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ అండ్ యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే ఆయన... గతేడాది నందమూరి నటసింహం బాలకృష్ణతో తెరకెక్కించిన 'అఖండ'తో సూపర్ హిట్‌ను అందుకుని ఫుల్ జోష్ మీదున్నారు. అలా వీరిద్దరు ఈ సినిమా కోసం పనిచేయడంతో.. ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరో రామ్ పక్కా మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇక హీరో రామ్ విషయానికొస్తే.. చివరగా 'ది వారియర్' సినిమాతో తమిళ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు నిరాశపరిచింది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆయన ఈ కొత్త సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.